ఇదేం బ్యాటింగ్ రా సామీ.. టెస్ట్ క్రికెట్ ను దున్నేస్తున్న రూట్

వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజు అనగానే సచిన్ టెండూల్కర్ పేరే గుర్తొస్తుంది. గత కొన్నేళ్ళుగా సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లీ కూడా రన్ మెషీన్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.

  • Written By:
  • Publish Date - October 9, 2024 / 06:05 PM IST

వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజు అనగానే సచిన్ టెండూల్కర్ పేరే గుర్తొస్తుంది. గత కొన్నేళ్ళుగా సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లీ కూడా రన్ మెషీన్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. అత్యంత నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్న రూట్ రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ దూసుకెళుతున్నాడు. తాజాగా పాక్ తో జరుగుతున్న తొలి టెస్టులో దుమ్మురేపాడు. ఇంగ్లండ్ తరఫున ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పడంతో పాటు ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనతలు సాధించాడు. ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ లో సెంచరీ బాది రూట్ రికార్డులు బ్రేక్ చేశాడు. 167 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్న జో రూట్‌‌కు టెస్టుల్లో ఇది 35వ సెంచరీ. ఇక ఈ ఏడాది‌లో అయిదో సెంచరీ. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆరో ప్లేయర్‌గా జో రూట్ చరిత్రకెక్కాడు.

ఈ క్రమంలో సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్ వంటి దిగ్గజ క్రికెటర్ల సెంచరీలను అధిగమించాడు. టెస్టుల్లో గవాస్కర్, లారా, యూనిస్ 34 సెంచరీలు చొప్పున బాదారు. ఇక ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర , రాహుల్ ద్రవిడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జో రూట్ జోరు చూస్తే అతి త్వరలో ద్రవిడ్, సంగక్కర సెంచరీ రికార్డులు కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అయిదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు అత్యధికసార్లు సాధించిన ఆటగాడిగానూ రూట్ ఘనత సాధించాడు.

రెడ్ బాల్ క్రికెట్ లో రూట్ గత కొంతకాలంగా సెంచరీల మీద సెంచరీలు కొడుతూనే ఉన్నాడు. ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఇటు స్వదేశంలోనూ , అటు విదేశాల్లో సైతం అతని పరుగుల ప్రవాహానికి అడ్డే లేకుండా పోయింది. 2013 నుంచి 2020 వరకు 17 సెంచరీలే బాదిన రూట్ ఈ మూడేళ్లలో ఏకంగా 18 సెంచరీలు కొట్టాడు. కాగా, టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ రూట్ రికార్డు సాధించాడు. అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ తరఫున కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 12వేల 472 పరుగులు చేశాడు. ఈ రికార్డును జో రూట్ 147 టెస్టుల్లోనే అందుకున్నాడు. రూట్ 50+ సగటుతో 12473 పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన అయిదో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.