క్రికెట్ లో బ్యాటింగ్, బౌలింగే కాదు ఫీల్డింగ్ కు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మైదానంలో పాదరసంలా కదిలే ఫీల్డర్లు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రపంచ క్రికెట్ లో ఎప్పటికీ అత్యుత్తమంగా నిలిచే ఫీల్డర్ గా జాంటీ రోడ్స్ కు గుర్తింపు ఉంది. ఎన్నోసార్లు తన చురుకైన ఫీల్డింగ్, మెరుపు త్రోలతో సౌతాఫ్రికాకు విజయాలనందించాడు. కాగా భారత క్రికెట్ లో అలా తనను ఇంప్రెస్ చేసిన ఫీల్డర్ ఎవరనేది సఫారీ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ వెల్లడించాడు. అందరూ అనుకుంటున్నట్టు కోహ్లీ , సురేష్ రైనాలు కాదని వారిద్దరి కంటే రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్ గా అభివర్ణించాడు.
ప్రస్తుత మోడ్రన్ క్రికెట్ లో జడేజాను మించిన ఫీల్డర్ లేడని కితాబిచ్చాడు. జడ్డూకు ఏ పొజిషన్ లోనైనా అత్యంత చురుగ్గా ఫీల్డింగ్ చేసే సత్తా ఉందని ప్రశంసించాడు. అతని క్యాచింగ్ స్కిల్స్ , త్రో స్కిల్స్ చూస్తే ఎవరైనా సరే బెస్ట్ ఫీల్డర్ గా ఒప్పుకోవాల్సిందేనన్నాడు. జడేజా బంతి వెనుక పరిగెడుతున్నాడంటే బ్యాటర్లు ఎక్స్ ట్రా సింగిల్ తీసేందుకు ఆలోచిస్తారన్నాడు. ఇక సురేష్ రైనా కూడా అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్ ఉన్న ఆటగాడని జాంటీ వ్యాఖ్యానించాడు.