ఐపీఎల్ చరిత్రలో భారీ అంచనాలు ఉండి ప్రతీసారీ నిరాశపరిచే టీమ్ ఏదైనా ఉందంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమే… మిగిలిన జట్లతో పోలిస్తే చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయింది. ఎప్పటికప్పుడు టైటిల్ గెలుస్తామంటూ ఆశలు రేకెత్తించి, పేలవ ప్రదర్శనతో చేతులెత్తేయడం బెంగళూరు జట్టుకు అలవాటుగా మారింది. అయితే ఈ సారి మెగా వేలం ఉండడంతో జట్టు కూర్పులో పలు మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచి ప్లేయర్స్ ను తీసుకోవాలంటూ పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఆర్సీబీకి కీలక సూచనలు చేస్తున్నారు. రోహిత్ శర్మను వేలంలో తీసుకుని జట్టు కెప్టెన్సీ ఇస్తే టైటిల్ అందిస్తాడని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు.
ఎలాంటి జట్టునైనా గొప్పగా నడిపించడంలో రోహిత్ అత్యుత్తమని అభిప్రాయపడ్డాడు. ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించిన హిట్ మ్యాన్ కెప్టెన్సీకి వందకు వంద మార్పులు ఇచ్చారని గుర్తు చేశాడు. గతంలో ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ ను వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ తీసుకోవాలని కైఫ్ సూచించాడు. ఒకవేళ రోహిత్ శర్మ ప్లేయర్ గా విఫలమైనా కెప్టెన్ గా మాత్రం సక్సెస్ ఫుల్ గా నడిపిస్తాడని కైఫ్ అంచనా వేశాడు. కాగా గత సీజన్ లో రోహిత్ ను సారథిగా తప్పించిన ముంబై ఇండియన్స్ హార్థిక్ కు కెప్టెన్సీ ఇచ్చింది. దీంతో ఆ ఫ్రాంచైజీని రోహిత్ వీడడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.