Yuzvendra Chahal: వరల్డ్ కప్ సరదా తీరాలంటే స్పిన్నర్లే కీలకం.. అతడు మరీ ముఖ్యం..!

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఓ ఆటగాడిపై జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరాడు. సీనియర్‌ స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ కీలకంగా మారతాడని దాదా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నాడు.

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 06:07 PM IST

Yuzvendra Chahal: భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో టీమ్‌ ఇండియా జట్టు కూర్పు ఎలా ఉండాలనే దానిపై ఇప్పటి నుంచే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఓ ఆటగాడిపై జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరాడు. సీనియర్‌ స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ కీలకంగా మారతాడని దాదా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నాడు.

‘మణికట్టు స్పిన్నర్లు రవి బిష్టోయ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు. చాహల్‌ ఈ మధ్య పెద్ద టోర్నమెంట్‌లలో ఆడటంలేదు. కానీ టీ20 ఫార్మాట్‌ అయినా, వన్డేలైనా అతడి నుంచి చాలా నిలకడైన ప్రదరన ఉంటుంది. అందువల్ల, ప్రపంచకప్‌ టోర్నీకి అతడిపైనా దృష్టి సారించడం ముఖ్యం’ అంటూ గంగూలీ విశ్లేషించాడు. స్వదేశంలో టోర్నమెంట్‌ జరుగుతున్న నేపథ్యంలో ‘ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాలతో ఇలాంటి పరిస్థితుల్లో ఆడేటప్పుడు మణికట్టు స్పిన్నర్లు బాగా రాణిస్తారు. 2011లో పీయూష్‌ చావ్లా బాగా బౌలింగ్‌ చేశాడు’ అని గంగూలీ గుర్తు చేశాడు. ఇక స్పిన్నర్లు చెలరేగిన సమయాల్లో భారత్‌ ఎక్కువ విజయాలను నమోదు చేసిందని దాదా విశ్లేషించాడు.

‘2007లో దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు ఫాస్ట్‌ బౌలర్లతోపాటు మణికట్టు స్పిన్నర్లు బాగా రాణించారు. భారత్‌లోని పరిస్థితులను చూసుకుంటే మణికట్టు స్పిన్నర్‌ జట్టులో ఉండటం ఎంతో కీలకం’ అని పేర్కొన్నాడు. ఇక టీమ్‌ ఇండియా అక్టోబర్‌ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో తన ప్రపంచకప్‌ పోరును ప్రారంభించనుంది.