IPL-2023: ఐపీఎల్ క్యాష్ రిచ్ లీగ్‌లో శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడబోతున్నాయి. ఇరు జట్లు కూడా తమ చివరి మ్యాచ్ విజయాలతో మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఈ మ్యాచ్ ఖచ్చితంగా సన్ రైజర్స్ బ్యాటింగ్‌కు, కోల్‌కతా బౌలింగ్‌కి మధ్య సమరంగా చెప్పుకోవాలి.
గతంలో ఈ రెండు జట్లు తలపడ్డ మ్యాచుల్లో కేకేఆర్ జట్టుదే పైచేయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు 23 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో నైట్ రైడర్స్ 15 మ్యాచుల్లో గెలవగా, సన్ రైజర్స్ జట్టు ఎనిమిదింట నెగ్గింది. సన్ రైజర్స్ మీద కలకత్తా జట్టు సాధించిన అత్యధిక స్కోరు 187 కాగా, కేకేఆర్ మీద ఆరెంజ్ ఆర్మీ సాధించిన టాప్ స్కోర్ 209. గత సీజన్లో తలపడ్డ మ్యాచులో ఒకదాంట్లో కోల్‌కతా జట్టు విక్టరీ కొట్టగా, రెండో మ్యాచులో హైదరాబాద్ పంజా విసిరింది. అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠీలకు కోల్‌కతా జట్టు మీద మంచి రికార్డ్ ఉంది.
కోల్‌కతాకు సంబంధించి, కెప్టెన్ నితీష్ రానా, ఆండ్రు రస్సెల్‌లకు మంచి పట్టు కనిపిస్తుంది. కానీ, ఓపెనర్ రహ్మనుల్లా గర్భాజ్ నుంచి కూడా సన్ రైజర్స్‌కు ముప్పు లేకపోలేదు. ఆఖరిగా ఈ రెండు జట్లు నాలుగుసార్లు పోటీపడగా, కేకేఆర్ జట్టు మొత్తం మూడు మ్యాచుల్లో గెలిచి ఆధిపత్యాన్ని చాటుకుంది. శ్రేయస్ అయ్యర్ లేకపోవడం కేకేఆర్ జట్టుకు కొంత మైనస్ అయినప్పటికీ, జట్టు సమిష్టి విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ 4 లో కొనసాగుతోంది. నేటి మ్యాచుతో రైజర్స్ సత్తా పూర్తిగా బయటపడనుంది.