KL Rahul: రాహుల్ జట్టులోకి వస్తే.. వేటు పడేది ఎవరిపై..?

ఇండియన్‌ టీమ్‌లోకి కేఎల్ రాహుల్ అడుగు పెట్టబోతుండటం ఆసక్తిని పెంచింది. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన రాహుల్ సెప్టెంబర్ 5న శ్రీలంక చేరుకున్నాడు. సమయం వృథా చేయకుండా వెంటనే జిమ్‌లో కసరత్తులు మొదలు పెట్టాడు.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 04:25 PM IST

KL Rahul: ఆసియా కప్‌ 2023 మ్యాచ్‌లకు పొంచి ఉన్న వర్షం ముప్పు క్రికెట్‌ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ చివరికి వర్షం.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఒక్క ఇన్నింగ్స్‌తోనే మ్యాచ్‌ రద్దు అయింది. అయితే ఇప్పుడు అందరూ సూపర్ 4లో భారత్-పాక్‌ తలపడనున్న మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.

అయినా అభిమానుల్లో ఆసక్తి తగ్గడం లేదు. శ్రీలంకలోని కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. వాతావరణం అనుకూలించని కారణంగా సూపర్ 4 మ్యాచ్‌లను హంబన్‌తోటకు మార్చడం గురించి చర్చలు మొదలైనా.. పాల్గొనే టీమ్‌లను సంప్రదించిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత మ్యాచ్‌లో మాదిరిగానే ప్లేయింగ్ ఎలెవన్‌ను పాకిస్థాన్ కొనసాగించాలని భావిస్తోంది. అయితే కండిషన్స్‌ స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటే, మహ్మద్ నవాజ్ స్థానంలో ఫహీమ్ అష్రఫ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే సెప్టెంబర్ 2న భారత్‌తో తలపడిన లైనప్ మళ్లీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇండియన్‌ టీమ్‌లోకి కేఎల్ రాహుల్ అడుగు పెట్టబోతుండటం ఆసక్తిని పెంచింది. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన రాహుల్ సెప్టెంబర్ 5న శ్రీలంక చేరుకున్నాడు. సమయం వృథా చేయకుండా వెంటనే జిమ్‌లో కసరత్తులు మొదలు పెట్టాడు. సెప్టెంబర్ 7న వర్షం కారణంగా ఏర్పాటు చేసిన ఇండోర్ ప్రాక్టీస్ సెషన్స్‌లో రాహుల్ చెమటోడ్చాడు.

శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్‌ను షేర్‌ చేసుకున్నాడు. నెట్స్‌లో తన కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే రాహుల్ వికెట్ కీపింగ్‌కి సంబంధించిన డ్రిల్స్‌ చేయకపోవడం కొన్ని సందేహాలను లేవనెత్తింది. ప్రస్తుతం ఇషాన్‌ మంచి ఫామ్‌లో ఉండటంతోపాటు, 5వ స్థానంలో లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాట్స్‌మెన్‌గా ఇండియా టీమ్‌కి మంచి ఆప్షన్‌ అయ్యాడు. ఒక వేళ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే శ్రేయస్ అయ్యర్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.