ఐపీఎల్ మెగా వేలం డిసెంబర్ లో జరగబోతోంది. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాపై తర్జన భర్జన పడుతుండగా… బీసీసీఐ త్వరలోనే దానికి సంబంధించిన రూల్స్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే కొందరు స్టార్ ప్లేయర్స్ తమ ఫ్రాంచైజీలపై అసంతృప్తిలో వేలంలోకి వెళుతున్నారు. ఈ జాబితాలో లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా ఉన్నట్టు సమాచారం. లక్నో రాహుల్ రిటైన్ చేసుకునే అవకాశాలు లేనట్టే.. అదే సమయంలో రాహుల్ కూడా ఆ ఫ్రాంచైజీతో కొనసాగేందుకు సుముఖంగా లేడు. గత సీజన్ లో సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా కో ఓనర్ సంజీన్ గోయెంకా గ్రౌండ్ లోనే ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణం. కాగా ఈ సారి వేలంలో రాహుల్ ను తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి.
బ్యాటర్ గానే కాకుండా సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉండడంతో వేలంలో అతనికి డిమాండ్ ఉంది. దీంతో రాహుల్ కు ఎంత ధర పలుకుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ వేలంలోకి వస్తే 10 కోట్ల లోపే బిడ్డింగ్ ఉంటుందని తెలుస్తోంది. 2022లో లక్నో ఫ్రాంచైజీ 17 కోట్లకు రాహుల్ ను తీసుకుంది. ఈ సారి అంత భారీ బిడ్ రాకపోవచ్చని సమాచారం. ఫ్రాంచైజీల మనీ పర్స్ లిమిట్, రాహుల్ ప్రస్తుత ఫామ్, జట్టు కూర్పు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే 10 కోట్లు దాటి బిడ్ వేసే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు.