కట్ చేస్తే రెండేళ్లు గడిచాయ్. ఇప్పుడు కోహ్లీ తన రివేంజ్ తీర్చుకునే పనిలో పడినట్లు కనిపిస్తున్నాడు. మూడు రోజుల కింద జరిగిన.. ఆర్సీబీ, ఢిల్లీ మ్యాచ్‌లో గంగూలీ వైపు కోహ్లీ చూపు.. కొత్త చర్చకు కారణం అయింది. డగౌట్‌లో కూర్చుకున్న కోహ్లీ.. గంగూలీ వైపు ఉరిమి చూశాడు. అక్కడితో ఆగాడా అంటే.. గేమ్ అయ్యాక షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తప్పించుకున్నాడు. మళ్లీ ప్రాక్టీస్ కోసం రెడీ అవుతుండగా.. అటుగా వెళ్తున్న దాదాపైకి కోహ్లీ కోపంగా చూడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాములుగానే అగ్రెసివ్‌నెస్‌కు అంగీ ప్యాంట్ వేసినట్లు ఉంటాడు కోహ్లీ.
ఢిల్లీతో మ్యాచ్‌లో అది ఇంకాస్త ఎక్కువ కనిపించింది. ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్ అయినా.. దాన్ని కోహ్లీ వర్సెస్ దాదాగానే చూశారు ఫ్యాన్స్ అంతా ! మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయాక.. దాదా తలదించుకోవడం కోహ్లీ మొహం చూడలేకే అని సోషల్‌మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీనికి కంటిన్యూటి అన్నట్లుగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ చేసిన పని… ఈ అనుమానాలకు మరింత బలానని ఇచ్చింది. ఇన్‌స్టాలో గంగూలీని అన్‌ఫాలో చేశాడు కోహ్లీ. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు నిజమే అని ప్రూవ్ అయింది. దీనికితోడు చేతన్ శర్మ ఎపిసోడ్ ఎలానూ వినిపిస్తూనే ఉంది. కోహ్లీకి అన్యాయం జరిగిన మాట నిజమే అని.. ఓ చానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్‌శర్మ బయటపెట్టాడు. ఆ వీడియో రేపిన రచ్చఅంతా ఇంతా కాదు. చివరికి చేతన్‌శర్మ జాబ్ కూడా ఊడిపోయిన పరిస్థితి.
2021లో టీ20 వరల్డ్ కప్ తర్వాత.. కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత రెండు నెలలకే వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాల్సిన పరిస్థితి. కోహ్లీ స్థానంలో రోహిత్ పగ్గాలు అందుకున్నాడు. ఐతే కెప్టెన్సీ మార్పు గురించి తనకు రెండు గంటల ముందే చెప్పారంటూ.. గంగూలీ టార్గెట్‌గా ఆ సమయంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు.. హాట్‌హాట్ డిబేట్‌కు కారణం అయ్యాయి. ఐతే ఆ తర్వాత పరిస్థితి చల్లారింది అనుకుంటే.. చేతన్‌శర్మ ఎపిసోడ్‌తో మంట మళ్లీ అంటుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య..
గంగూలీ వైపు చూస్తూ కోహ్లీ ఇచ్చిన లుక్‌తో.. జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.
ఎవరిని ఎవరు కోపంగా చూశారు.. ఎందుకు చూశారు.. వీళ్లిద్దరి మధ్య జరిగింది ఇదే అని ఎవరు బయటకు చెప్పారు అనే సంగతి పక్కనపెడితే.. బీసీసీఐ పరువు మళ్లీ బజారున పడినట్లు అయింది. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరు ఉంది. ఒకరకంగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బోర్డు ఇది.. అలాంటి బోర్డులో ఇలాంటి చీప్ పాలిటిక్స్ జరగడం.. సిగ్గుపడాల్సిన అంశం. బీసీసీఐలో ఉన్న లొసుగులు అన్నీ ఇన్నీ కావు. ఒక వర్గానికే అవకాశం ఇస్తారని.. నచ్చిన వాళ్లకే పెద్దపీట వేస్తారనే పేరు ఉంది. ఇప్పుడు కోహ్లీ, గంగూలీ రచ్చతో ఆ పేరుకు మరింత బలం చేకూరే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడికైనా బోర్డు పెద్దల్లో మార్పు రావాలి.. బోర్డుల మార్పు రావాలని ఫ్యాన్స్ అంటున్నారు.