Kolkata Team: శభాష్ రింకూసింగ్.. ఆ క్రికెటర్లు చేయనిది చేస్తున్నావ్.!

రింకూసింగ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌.. కాదు కాదు స్టార్‌గా ఎదిగిన బ్యాట్స్‌మెన్‌.. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. ఒక్క మ్యాచ్‌తోనే దేశమంతా తనవైపు చూసేలా చేసుకున్నాడు. కానీ ఆ కుర్రోడి ఆటే కాదు మనసు కూడా పెద్దదే.. స్టార్‌ క్రికెటర్లు చేయలేని పని చేసి అందరి మనసులు గెలుచుకుంటున్నాడు.

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 05:15 PM IST

రింకూసింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌. ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. చిన్న చిన్నపనులు చేసుకునేవాడు. ఇంటింటికీ తిరిగి గ్యాస్‌ సిలిండర్లు వేసేవాడు. ఆ పని ఎగ్గొట్టినందుకు తండ్రితో దెబ్బలు తినేవాడు. ఓవైపు పని చేసుకుంటూనే క్రికెట్‌పై ఇష్టంతో బ్యాటు పట్టుకున్నాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఓ పూట పని మరోపూట ఆట.. అది నీకు తిండిపెట్టదు అన్న వాళ్ల నోళ్లు మూయించాడు. కసితో ఎదిగాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో అతడో సెన్సేషన్.. స్టార్ట్‌ అని చెప్పుకునే ఎంతోమందికి సాధ్యం కాని ఇన్నింగ్స్‌ ఆడి ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు.

గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఐదుసిక్సులు బాది తన స్టామినా ఏంటో చూపించాడు. అతడి స్టామినానే కాదు మనసు కూడా పెద్దదే.. తను పుట్టిపెరిగిన అలీఘడ్‌లో చిన్న క్రికెటర్ల కోసం స్పోర్ట్స్‌ హాస్టల్ కట్టిస్తున్నాడు రింకూసింగ్. 50లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ దీన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇందులో ఒకేసారి 50మందికి శిక్షణ ఇవ్వొచ్చు. వారికి కావలసిన అన్ని సౌకర్యాలు ఇందులో కల్పిస్తున్నాడు రింకూ. వచ్చేనెలలోనే ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఆర్థికంగా వెనకబడిన ట్యాలెంటెడ్‌ యంగ్‌ క్రికెటర్లను పైకి తీసుకువచ్చేందుకే దీన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పాడు రింకూ సింగ్.

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో రింకూను 55లక్షల రూపాయలకే కోల్‌కతా సొంతం చేసుకుంది. విదేశీ క్రికెటర్లకు పెట్టిన మొత్తంతో పోల్చితే రింకూకి ఇచ్చింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు జట్టులో అతడు ప్రధానమైన బ్యాట్స్‌మెన్.. నమ్మకమైన ఆటగాడు. తనకు ఐపీఎల్‌లో వచ్చేది 55లక్షలైతే స్పోర్ట్స్‌ హాస్టల్‌ కోసమే 50లక్షలు ఖర్చు పెడుతున్నాడు రింకూ. ఇది నిజంగా అభినందించదగ్గ విజయమే.

పేదరికాన్ని దగ్గర్నుంచి చూసిన రింకూకు ఆ బాధేంటో తెలుసు. తనలా యువక్రికెటర్లు ఆ బాధ పడకూడదని పెద్దమనసుతో వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. రింకూది పేద కుటుంబం.. అతడికి ఆటలో వచ్చేది తక్కువ.. కానీ దాన్ని దాచుకోవాలని చూడలేదు. తనకు తిండిపెడుతున్న ఆటకే ఖర్చు చేస్తున్నాడు. పెద్దపెద్ద స్టార్‌ క్రికెటర్లలాగా రింకూకు స్పాన్సర్స్‌ లేరు.. కోట్లు కుమ్మరించే యాడ్స్‌ లేవు.. కానీ అతడు మాత్రం అవేమీ ఆలోచించలేదు. చాలామంది పేరున్న ఆటగాళ్లు యువ ఆటగాళ్లకు ఏం చేస్తున్నారంటే మాత్రం ఆలోచించాల్సిందే. సలహాలు తప్ప సాయం చేసేవారు తక్కువ. 55లక్షలు సంపాదిస్తున్న రింకూనే ఇంత చేస్తుంటే కోట్లకు కోట్లు తీసుకుంటున్న ఆటగాళ్లు ఇంకెంత చేయాలి.?

రింకూకు ఇంకా జాతీయజట్టులో చోటు దక్కలేదు. తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా కూడా లేదు. అలాంటి సమయంలో అతడికి ఐపీఎలే ఆధారం. కానీ దానిపై వస్తున్న డబ్బులో సింహభాగం యువక్రికెటర్ల కోసం ఖర్చు చేస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు రింకూ. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.