Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి పోరుకు సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టుతో ఎస్‍ఆర్‌హెచ్ తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా, శనివారం సాయంత్రం ఏడున్నర గంటల నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో తొలిసారి బరిలోకి దిగనుంది. ఈ సీజన్ కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్యాట్ కమిన్స్‌ను వేలంలో ఏకంగా రూ.20.50కోట్లకు సొంతం చేసుకుంది.
CSK VS RCB: అదే జుట్టు.. అదే జోరు.. పాత ధోని పూనకాలు రిపీట్
ఆస్ట్రేలియాకు కెప్టెన్‍గా గతేడాది వన్డే ప్రపంచకప్, టెస్టు చాంపియన్‍షిప్ టైటిళ్లను అందించిన కమిన్స్.. ఐపీఎల్‍లోనూ ఎస్ఆర్‌హెచ్‍ను సక్సెస్‍ఫుల్‍గా ముందుకు నడిపిస్తాడని ఫ్రాంచైజీ, ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. గతేడాది ఐపీఎల్ 2023లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. 14 మ్యాచ్‍ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి ఘోర ప్రదర్శన చేసింది. అయితే, ఐపీఎల్ 2024లో సత్తాచాటాలని కసితో ఉంది. ముఖ్యంగా కమిన్స్ కెప్టెన్సీలో మ్యాజిక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు కోల్‍కతా నైట్ రైడర్స్ కెప్టెన్‍గా శ్రేయస్ అయ్యర్ మళ్లీ తిరిగి వచ్చేశాడు. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్‍కు శ్రేయస్ దూరం కాగా, కేకేఆర్‌కు నితేశ్ రాణా కెప్టెన్సీ చేశాడు. గత సీజన్‌లో కోల్‍కతా.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. దీంతో తొలిపోరులో గెలిచి శుభారంభం చేయాలని కోల్‍కతా, హైదరాబాద్ పట్టుదలగా ఉన్నాయి.