World Cricket Board : మన రంజీ క్రికెటర్ల కంటే తక్కువ.. జింబాబ్వే ప్లేయర్స్ మ్యాచ్ ఫీజు ఎంతో తెలిసా ?

ఇదే సమయంలో జింబాబ్వే ఆట‌గాళ్ల ప‌రిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జింబాబ్వే ఆట‌గాళ్ల‌కు ఒక్కో టీ20 మ్యాచ్ ఆడితే భారత క‌రెన్సీలో కేవలం 20 వేల వ‌ర‌కు ద‌క్కుతుంది.

ప్రపంచ క్రికెట్ లో రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐనే… ఆటగాళ్ళకు భారీగా జీతాలు ఇవ్వడంలోనూ మన క్రికెట్ బోర్డుదే పై చేయి… చాలా మంది క్రికెటర్లు మ్యాచ్ లు ఆడినందుకే లక్షల్లో సంపాదిస్తూ, బయట బ్రాండింగ్స్ తోనూ కోట్లలో ఆర్జిస్తున్నారు. కాగా ఒక్కో టీమిండియా క్రికెట‌ర్ టెస్ట్ మ్యాచ్ ఆడితే ప‌దిహేను ల‌క్ష‌లు, వ‌న్డే మ్యాచ్ ఆడితే ఆరు ల‌క్ష‌లు, టీ20 మ్యాచ్ ఆడితే మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు మ్యాచ్ ఫీజుల రూపంలో అందుకుంటారు. ప్ర‌స్తుతం జింబాబ్వేతో జ‌రుగుతోన్న సిరీస్ ద్వారా టీమిండియా ప్లేయ‌ర్లు మ్యాచ్ ఫీజుల ద్వారానే ఒక్కొక్కరూ 10 నుంచి 15 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటారు.

ఇదే సమయంలో జింబాబ్వే ఆట‌గాళ్ల ప‌రిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జింబాబ్వే ఆట‌గాళ్ల‌కు ఒక్కో టీ20 మ్యాచ్ ఆడితే భారత క‌రెన్సీలో కేవలం 20 వేల వ‌ర‌కు ద‌క్కుతుంది. మన రంజీ క్రికెటర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రంజీల్లో మన క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్ కూ కనీసం 40 నుంచి 60 వేలు మ్యాచ్ ఫీజుగా అందుతుంది. ప్రస్తుతం ఇండియాతో జరిగే టీ20 సిరీస్ మొత్తం ఆడితే ఒక్కో జింబాబ్వే ప్లేయ‌ర్‌కు ల‌క్ష వ‌ర‌కు సంపాదించే అవ‌కాశం ఉంది. సీనియారిటీ ప్ర‌కారం కొంద‌రు క్రికెట‌ర్ల‌కు ల‌క్ష కంటే త‌క్కువ మొత్త‌మే అందుతుంది. కొన్నేళ్ళుగా జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అప్పుడప్పుడు భారత్ లాంటి పెద్ద జట్లతో సిరీస్ ఆడితే బ్రాడ్ కాస్టింగ్ , ఇతర స్పాన్సర్ల ద్వారా కాస్త ఆదాయం వస్తుండడమే వారికి ఊరటనిస్తోంది.