తిలక్ వర్మ.. మనోడే.. సిరాజ్ మనోడే..! ముంబై, బెంగళూరు జట్టులో కీలక ఆటగాళ్లు వీళ్లు..! వాళ్లు లేకుండా ఆ జట్లను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊహించడం కష్టం. మన హైదరాబాదీ కుర్రాళ్లు ఇలా పక్క ఫ్రాంచైజీల్లో దుమ్మురేపుతుండడం చూస్తుంటే ఏమనిపిస్తుంది..? అబ్బా.. వీళ్లను ఎందుకు ఆక్షన్‌లో తీసుకోలేదు అనిపిస్తుందా? మన సొంత ప్లేయర్లను పక్క ఫ్రాంచైజీలు అద్భుతంగా వినియోగించుకుంటుంటే ఓవైపు వాళ్ల కెరీర్ బాగుపడిందన్న ఆనందం ఉందేమో కానీ.. సన్‌రైజర్స్‌కే ఆడి ఉంటే మన బతుకు ఇలా ఏడ్చేది కాదన్న బాధ కూడా ఉంది. అసలు తప్పంతా ఆక్షన్‌లోనే జరుగుతుందా..? ప్లేయర్లను నిందించడం కరెక్ట్ కాదా?
లాస్ట్ ప్లేస్ కోసం ఫైట్:
ఏం మారలేదు.. అసలేం మారలేదు.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఫేట్ ఏం మారలేదు..! పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటి పడుతుంది హైదరాబాద్. గెలవాల్సిన మ్యాచ్‌లో కూడా ఓడిపోవడం మనకే చెల్లింది.. లాస్ట్ ఓవర్‌లో గెలవడానికి 9పరుగులు కూడా చేయలేని జట్టు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ మాత్రమేననిపిస్తుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో కేవలం మూడు పరుగులే చేశారు ఆరెంజ్ ఆర్మీ వీరులు. ఓడిపోవడం కోసం ఆడరేమో అనిపించింది.. లేదు లేదు.. కోల్‌కతాపై జాలీతో ఆడినట్లు అనిపించింది. ఈ ఒక్క మ్యాచే ఇలా జరిగి ఉంటే పోనిలే.. లక్ బాలేదు అనుకోవచ్చు.. కానీ.. దాదాపు ప్రతి మ్యాచ్ ఇలానే జరిగితే..? ప్రతి సీజన్‌లోనూ తలరాత మారకపోతే..?
కొంపముంచుతున్న ఇండియన్ ప్లేయర్లు:
ఒకప్పుడు వార్నర్ ఒంటిచేత్తో విజయాలు అందించేవాడు. ఓపెనర్‌గా వచ్చే వార్నర్ జట్టు స్కోరులో 40శాతం పరుగులు చేసేవాడు.. అతను ఆడితేనే నిలిచినట్లు లేకపోతే లేదు. మిడిలార్డర్‌లో వచ్చే మనీశ్‌పాండే.. కొన్నాళ్లు కేఎల్ రాహుల్.. ఆఖరికి దీపక్ హుడా లాంటి వీరులు ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఆడేవాళ్లు కాదు..! దానికి తోడు జిడ్డు.. పరమ జిడ్డు.. బయటకు వెళ్లి బిర్యానీ తినే టైమ్ ఉండదేమో.. గ్రౌండ్‌లోనే బాల్స్ తింటుంటారని ఫ్యాన్స్ తెగ ఫీల్ ఐపోతున్నారట..! ఈ ఏడాది కూడా జిడ్డుగాళ్లు టీమ్‌ను ముంచేస్తున్నారు. హిట్టింగ్‌తో బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించే రాహుల్ త్రిపాఠి సైతం బాల్స్ వేస్ట్ చేస్తుండడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అటు మయాంక్ అగర్వాల్ సంగతి మాట్లాకపోతేనే మంచిది.. కేఎల్ రాహుల్ పూనినట్లు ఆడుతున్నాడంటూ అతనిపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంత కేఎల్ రాహుల్ ఫ్రెండైతే మాత్రం స్టాట్ ప్యాడ్ ఇన్నింగ్స్‌తో జట్టును ముంచేస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు.
వార్నర్‌ను తోసేశారు.. కేన్ మామను తీసేశారు:
వార్నర్ కెప్టెన్సీలోనే హైదరాబాద్ 2016లో కప్ గెలిచింది. ఆ సీజన్‌లో అతనే రెండో టాప్ స్కోరర్.. జట్టును ముందుండి గెలిపించి.. ఫైనల్‌లోనూ రాణించాడు.. పటిష్ట ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్‌ను తన కెప్టెన్సీ స్కిల్స్‌తో ఛేజ్ చేయనివ్వకుండా అడ్డుపడ్డాడు.. ఏదో ఒక సీజన్ ఫెయిల్ అయ్యాడు.. ఇంకేముంది పీకి పక్కన పడేశారు..రోహిత్ శర్మ గత నాలుగు సీజన్లగా బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. ముంబై అతని కనీసం కెప్టెన్సీ నుంచి తీసే సాహసం కూడా చేయదు. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీ ఆ జట్టుకు కొండంత అండ. ఇటు వార్నర్‌ను మాత్రం ఎన్నో అవమానలకు గురి చేసింది సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ.
అటు వార్నర్ లేని ఓ సీజన్ మొత్తం కేన్ విలియమ్‌సన్ జట్టును ముందుండి నడిపించాడు. 2018 ఐపీఎల్ సీజన్ ఫైనల్ వరకు జట్టును సింగిల్ హ్యాండ్‌తో తీసుకొచ్చాడు. బ్యాటింగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. కానీ అతను కూడా ఇప్పుడు టీమ్‌లో లేడు. అసలు కెప్టెన్సీ చేయగల ఆటగాడు సన్‌రైజర్స్‌లో లేడు.. ఆ మధ్య మయాంక్ అగర్వాల్‌కి కెప్టెన్సీ అప్పగిస్తారని వార్తలొచ్చాయి.. కానీ దేవుడికి మనపై కాస్త జాలి ఉందేమో..మార్క్రమ్‌కు ఫైనల్ చేశారు.. లేకపోతే ఈ 9 మ్యాచ్‌ల్లో మూడు కాదు కదా.. ఒకటి కాదు గెలిచేవాళ్లం కాదు అని ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది హ్యారీ బ్రూక్‌ను 13కోట్లు పెట్టి కొంటే మనోడు ఓ సెంచరీ బాదేసి తర్వాత డకౌట్లు.. పది పరుగులు, 13పరుగులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.. మిగిలిన జట్టు యువరక్తాన్ని నమ్ముకొని..అనుభవాన్ని జత చేస్తూ విజయాలు సాధిస్తుంటే హైదరాబాద్ మాత్రం అడ్డదిడ్డమైన స్ట్రాటజీలతో అన్ బ్యాలెన్స్‌డ్ టీమ్‌తో వరుస పరాజయాలు మూటగట్టుకుంటోంది. ఈ ఏడాది ప్లే ఆఫ్ ఆశలు దాదాపు లేనట్లే.. ఇక వచ్చే ఏడాది నుంచైనా ఆక్షన్‌పై కాస్త శ్రద్ధ పెట్టాలని.. ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్లపై డిపెండ్ అవ్వకుండా ఇండియన్ ప్లేయర్లను నమ్ముకుంటే మంచిదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.