ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి రోహిత్ శర్మ రికార్డు ధర పలుకుతాడని చాలా మంది అంచనా… ముంబై ఫ్రాంచైజీ తీరుతో కాస్త అసంతృప్తిగా ఉన్న హిట్ మ్యాన్ వేలంలోకి వస్తాడని భావిస్తున్నారు. అతన్ని తీసుకుని జట్టు పగ్గాలు అప్పగించేందుకు రెండు,మూడు ఫ్రాంచైజీలు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఎంతైనా ఇచ్చేందుకు కూడా సై అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 50 కోట్ల వరకూ రోహిత్ కోసం వెచ్చిస్తారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా ఈ వార్తలపై స్పందించారు. 50 కోట్లు ఒక్కరి కోసమే ఖర్చు చేస్తే మిగిలిన డబ్బులతో టీమ్ ను ఎలా కొనాలని ప్రశ్నించారు. ఫ్రాంచైజీలు ఆ స్థాయిలో ఒక్క ప్లేయర్ కోసం ఖర్చు చేస్తారని తాను అనుకోవడం లేదన్నారు.
రోహిత్ శర్మను వేలంలో ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఆచితూచి జవాబిచ్చారు. వేలంలో టాప్ ప్లేయర్స్ ను తీసుకోవాలని ప్రతీ ఫ్రాంచైజీ కోరుకుంటుందన్నారు. అయితే అందుబాటులో ఉన్న మనీ పర్స్ పై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. జట్టు కూర్పును కూడా చూసుకోవాలని, అనుకూలమైన ధరకు కొనుగోలు చేసే పరిస్థితి వస్తే టాప్ ప్లేయర్స్ ను ఎవరూ వద్దనుకోరన్నారు. రోహిత్ లాంటి కెప్టెన్ ను అన్ని జట్లూ కోరుకుంటాయని అయితే అందరినీ తీసుకోవడం కుదరదు కదా అంటూ వ్యాఖ్యానించారు.