Sachin Tendulkar: బెట్టింగ్ చేయమంటున్నావ్.. నీకెందుకు భారతరత్న.. సచిన్‌పై ఎమ్మెల్యే ఫైర్..!

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే.. సచిన్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. సచిన్ టెండూల్కర్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ‘డుబియస్’ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 02:29 PM IST

Sachin Tendulkar: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు నిరసన చేప్టటినందుకుగానూ ఒక ఎమ్మెల్యేతో పాటు 22 మంది కార్యకర్తలు అరెస్టయ్యారు. ప్రహార్ జన్‌శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ, తన పార్టీ కార్యకర్తలతో కలిసి గురువారం ముంబై నగరంలోని బాంద్రాలో ఉన్న సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే.. సచిన్ ఇంటి ముందు నిరసన చేపట్టారు.

సచిన్ టెండూల్కర్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ‘డుబియస్’ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయంటూ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉంటూ భారతరత్న పొందిన సచిన్.. ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం సరికాదన్నారు. ‘బ్యాటింగ్ టు బెట్టింగ్’ అంటూ సచిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నందుకు భారతరత్న అవార్డును వెనక్కి ఇచ్చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.

ఎంతో మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అధిక వడ్డీలకు డబ్బులు అప్పు తెచ్చి మరీ దీనిలో పెడుతున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి ప్రకటనల నుంచి సచిన్ తప్పుకోకుంటే గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించే ప్రతి గణేశ్ మండపం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యేతో సహా 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై సెక్షన్37, 135 కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.