Mayank Agarwal: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. త్రిపుర రాజధాని అగర్తల నుంచి దిల్లీకి వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. దీంతో మయాంక్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ త్రిపురతో జరిగిన మ్యాచ్ అనంతరం తన జట్టుతో కలిసి దిల్లీ విమానం ఎక్కాడు. మంచినీళ్లు అనుకొని తను కూర్చున్న సీటు ముందు పౌచ్‌లోని ద్రవాన్ని కొద్దిగా తాగాడు.
IND Vs ENG: భారత్‌కు వైట్ వాష్ తప్పదు.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ వార్నింగ్
దీంతో వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహచరులు స్థానిక ఐఎల్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. మయాంక్ గొంతులో వాపు, బొబ్బలు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచే తన మేనేజర్ సహాయంతో మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. వైద్యుల సూచనతో త్వరలోనే బెంగళూరుకు తీసుకురానున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
భారత జట్టు తరపున 21 టెస్టు లాడిన మయాంక్ ప్రస్తుతం రంజీట్రోఫీలో కర్ణాటక జట్టును లీడ్ చేస్తున్నాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక విజయం సాధించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో సూరత్ వేదికగా రైల్వేతో ఫిబ్రవరి 2న జరగనున్న మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు.