Mohammed Amir: ఐపిఎల్ కోసం వెయిటింగ్ వచ్చే సీజన్ వచ్చేస్తున్నా

పాకిస్తాన్ మాజీ సంచలనం మహమ్మద్ ఆమిర్.. ఐపీఎల్ అరంగేట్రానికి రెడీ అవుతున్నాడట. పాకిస్తాన్ తరఫున అతని కెరీర్ అర్ధంతరంగా ముగిసినా.. తన సూపర్ బౌలింగ్‌తో పేరు సంపాదించాడీ పేసర్. కానీ ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 01:54 PM IST

ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతున్న అతను.. ఐపీఎల్‌లో తన అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఆమిర్ ఇటీవలే బ్రిటన్‌కు చెందిన లాయర్ నర్జీస్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బ్రిటిష్ పాస్‌పోర్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను ఎప్పుడో 2020లోనే ఇంగ్లండ్‌కు మకాం మార్చేశాడు. ఇప్పుడు కనుక అతనికి ఇంగ్లండ్ పాస్‌పోర్టు దక్కితే.. అవసరమైతే ఇంగ్లండ్ తరఫున ఆడే అవకాశం కూడా అతనికి ఉంటుంది. అదే జరిగితే ఐపీఎల్‌లో కూడా అతనికి మంచి ధర లభించే ఛాన్స్ ఉంది. 2008లో తొలి ఐపీఎల్ సీజన్‌లో పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఆడారు. కానీ ఆ తర్వాత భారత్, పాక్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో బ్యాన్ చేశారు.

ఇప్పుడు ఆమిర్ కనుక బ్రిటన్ పౌరసత్వం అందుకుంటే.. ఐపీఎల్‌లో అతనిపై నిషేధం ఉండదు. దీంతో అతను ఐపీఎల్ ఆడతాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై మాట్లాడిన ఆమిర్ మాత్రం.. తాను ఇప్పుడే అంత దూరం ఆలోచించడ లేదన్నాడు. ‘నేను ఇంగ్లండ్‌కు ఆడను. పాక్‌కు ఆడేశాను. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఇంకో ఏడాది వెయిట్ చేయాల్సి ఉంది కదా. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నేను ఏం చేసినా స్టెప్ బై స్టెప్ చేస్తా.. మరీ ముందుకు ఆలోచించను. అసలు రేపు ఏమవుతుందో చెప్పలేం. అలాంటిది వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి ఏం చెప్తాను? పాస్‌పోర్టు వచ్చాక నాకు దొరికే బెస్ట్ ఆప్షన్ ఎంచుకుంటా’ అని ఆమిర్ వెల్లడించాడు.

పాక్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడిన ఆమిర్.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌ను బెంబేలెత్తించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దీంతో ఐసీసీ టోర్నీలో తొలిసారి భారత్‌పై పాక్ ఒక వన్డే మ్యాచ్ నెగ్గింది. అంతేకాదు, ఆ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడింది. 2020లో ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.