Mohammed Shami: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమి వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ప్రస్తుతం చీలమండల గాయంతో బాధపడుతున్న షమి లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సర్జరీ అనంతరం షమి పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తెలుస్తోంది.
IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ చెన్నై వర్సెస్ బెంగళూర్
దీంతో ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌తో సహా స్వదేశంలో జరగనున్న న్యూజిలాడ్, బంగ్లాదేశ్ పర్యటనలకు కూడా షమి అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు అతడు రీఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. జనవరి చివరి వారంలో తన చీలమండ గాయానికి చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన షమీ ప్రత్యేకమైన ఇంజెక్షన్లను తీసుకున్నాడు. మూడు వారాల తర్వాత గాయం తగ్గిపోతుందని భావించినప్పటకీ.. ఇంజెక్షన్లు పనిచేయలేదు. దీంతో ఇప్పుడు సర్జరీ తప్పనిసరిగా మారిందని బోర్డు వర్గాలు తెలిపాయి. సర్జరీ కోసం షమి త్వరలోనే యూకేకు వెళ్లనున్నాడు. ప్రపంచకప్‌లో 24 వికెట్లతో సత్తాచాటిన షమీ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ షమి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ ఫైనల్‌కు చేర్చడంలో షమి కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో షమి 17వ సీజన్‌కు అందుబాటులో లేకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి మొదలు కానుంది.