Mohammed Siraj: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఊచకోతతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఏకంగా తన తొలి స్పెల్‌లో 6 వికెట్లతో రెచ్చిపోయాడు. అతని ధాటికి శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో సిరాజ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ పాతుమ్ నిస్సంక క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో సూపర్ డైవ్‌తో జడేజా అందుకున్న క్యాచ్‌తో పాతుమ్ నిస్సంక నోరెళ్ల బెట్టాడు. అసాధారణ క్యాచ్‌తో నిరాశగా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమరవిక్రమ మరుసటి బంతిని డాట్ చేసి మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ మరుసటి బంతికి గత మ్యాచ్ విన్నర్ చరిత్ అస్సలంక డకౌటయ్యాడు. సిరాజ్ వేసిన ఫుల్ డెలివరీని అసలంక డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా కవర్స్‌లో ఉన్న కిషన్ చేతిలో పడింది. అనంతరం ధనంజయ డిసిల్వా బౌండరీ కొట్టి చివరి బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ వేసిన ఔట్ స్వింగర్ పుష్ చేసే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో ఒకే ఓవర్‌లో సిరాజ్ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్‌గా సిరాజ్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. అతని కంటే ముందు శ్రీలంక మాజీ గ్రేట్ బౌలర్ లసిత్ మలింగ మాత్రమే వన్డేల్లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్ డసన్ షనకను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఐదు వికెట్లు తీసిన ఘనతను అందుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా శ్రీలంక తొలి వికెట్ తీయగా.. సిరాజ్ ఆ జట్టు పతనాన్ని శాసించాడు. మొత్తానికి ఆరు వికెట్లతో శ్రీలంక సింహాలను వేటాడిన హైదరాబాద్ చిరుతగా సిరాజ్ అభిమానుల చేత శబాష్ అనిపించుకున్నాడు. మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్య కూడా మూడు వికెట్లతో సత్తా చాటి, శ్రీలంకను లోయెస్ట్ టోటల్‌కు ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. శ్రీలంక పది వికెట్లు కోల్పోయి, 50 పరుగులకే చాపచుట్టేయగా, టీమిండియా స్వల్ప లక్షాన్ని ఎంత సేపట్లో ముగిస్తుందో అని, టీమిండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు.