Tilak Varma: ముంబై ఇండియన్స్ వల్లే ఇదంతా: తిలక్ వర్మ

తాను భారత జట్టుకు ఎంపికయ్యానన్న వార్త చెప్పగానే తన తల్లిదండ్రులు, కోచ్‌ ఎంతో ఉద్వేగానికి గురయ్యాని, కన్నీళ్లను ఆపుకోలేకపోయారని తిలక్ వర్మ తెలిపాడు. తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఇచ్చిన సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని తెలిపాడు.

  • Written By:
  • Publish Date - July 8, 2023 / 03:50 PM IST

Tilak Varma: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం తన కెరీర్‌‌ను మలుపు తిప్పిందని హైదరాబాద్ స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ అన్నాడు. ముంబైకి ఆడటం వల్లే తాను టీమిండియా‌కు ఆడే అవకాశాన్ని అందుకున్నానని తెలిపాడు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కిన విషయం తెలిసిందే. తాను భారత జట్టుకు ఎంపికయ్యానన్న వార్త చెప్పగానే తన తల్లిదండ్రులు, కోచ్‌ ఎంతో ఉద్వేగానికి గురయ్యాని, కన్నీళ్లను ఆపుకోలేకపోయారని తిలక్ వర్మ తెలిపాడు.

తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఇచ్చిన సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని తెలిపాడు. “ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. మ్యాచ్‌ ఆడుతున్నంతసేపు ఇతర ఆలోచనలు లేకుండా ఆటపైనే మనసు నిమగ్నం చేయడాన్ని విండీస్‌ దిగ్గజం కీరన్‌ పొలార్డ్‌ నుంచి నేర్చుకున్నా. ఆటలో ఎలాంటి తప్పులు జరిగినా ఆ బంతికే దానిని వదిలేసి, తదుపరి బంతిపై ఎలా గురి పెట్టాలనేది పొలార్డ్‌ నేర్పించాడు. అతను చెప్పిన చిట్కా నాకు బాగా ఉపకరించింది” అని తిలక్‌ చెప్పుకొచ్చాడు.

“టీమిండియాలో చోటు దక్కించుకోవడం నాకు చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు నిద్రలో కూడా దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ గురించే ఆలోచిస్తా. ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాను కాబట్టి మరింత ఆత్మవిశ్వాసంతో ఆడుతా. చిన్నప్పటి నుంచి తెల్లబంతి కంటే ఎర్రబంతి క్రికెట్‌నే ఎక్కువగా ఆడాను. రెడ్ బాల్ మ్యాచ్‌లోనే మన నైపుణ్యాలకు అసలు సిసలు పరీక్ష ఎదురవుతుందని కోచ్‌లు చెప్పేవాళ్లు. ఇప్పుడు అలాంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నా” అని తిలక్ వర్మ తన ఉత్సాహాన్ని బయటపెట్టాడు.