MS DHONI: ధోనీని మోసం చేసిన స్నేహితుడు.. కేసు పెట్టిన మిస్టర్ కూల్..

ధోనీని తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ పార్టనర్ ఒకరు మోసం చేసాడు. దీనిపై కోర్టును ఆశ్రయించాడు ధోనీ. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌పై ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు పెట్టాడు.

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 06:36 PM IST

MS DHONI: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యాపార రంగంలో ఎప్పటి నుంచో రాణిస్తున్నాడు. తన బ్రాండింగ్‌తో చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. అయితే నమ్మినవారే మోసం చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి ధోనీ ఎదుర్కొంటున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ పార్టనర్ ఒకరు మహీని మోసం చేసాడు. దీనిపై కోర్టును ఆశ్రయించాడు ధోనీ. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌పై ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు పెట్టాడు.

KA PAUL: కేఏ పాల్‌పై విష ప్రయోగం జరిగిందా.. వైరల్ ఆడియోలో ఏముంది..?

2017లో వీరి భాగస్వామ్యంతో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు డీల్ జరిగింది. నిబంధనల ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుము చెల్లించి, లాభాలు పంచుకోవాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఈ విషయాన్ని నోటీసుల ద్వారా ఆర్కా స్పోర్ట్స్‌కు పలుసార్లు తెలియజేసినా ఫలితం లేకపోయింది. దీంతో 2021 ఆగస్టులో ఆర్కా సంస్థకు మంజూరు చేసిన అధికారిక లేఖను ధోనీ ఉపసంహరించుకున్నాడు. అనంతరం పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించారు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ తాజాగా కోర్టును ఆశ్రయించారు. మిహిర్‌ దివాకర్‌, సౌమ్య విశ్వాస్‌పై రాంచీ కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు.

ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్కా స్పోర్ట్స్‌ చేసిన మోసం కారణంగా ధోనీకి రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీంతో వారిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ధోనీ క్రికెట్‌ అకాడమీ పేరుతో ఆర్కా స్పోర్ట్స్‌ దేశంలో పలు చోట్ల అకాడమీలు ప్రారంభించారు. ప్రస్తుతం ధోనీ పెట్టిన కేసుతో క్రికెట్ వర్గాల్లో కలకలం రేగింది. కాగా ఇటీవలే దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ధోనీ స్వదేశానికి తిరిగొచ్చాడు. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ కోసం ఈ చెన్నై కెప్టెన్ రెడీ అవుతున్నాడు.