Ambati Raidu: రాయుడు లాగిన తీగతో డొంక మొత్తం కదులుతుంది

టీమిండియా వెటరన్, ఐపీఎల్ లెజెండ్ అంబటి రాయుడు ఇటీవలే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను.. 2019 వరల్డ్ కప్‌లో తనను ఎంపిక చేయకపోవడం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

  • Written By:
  • Publish Date - June 17, 2023 / 03:23 PM IST

తను ఆంధ్రకు ఆడేప్పుడు ఎం ఎస్ కే ప్రసాద్‌తో విభేదాలు వచ్చినట్లు చెప్పాడు. 2019 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీకి ఎం ఎస్ కే ప్రసాద్ చీఫ్‌గా ఉన్నాడు. అతని వల్లనే తనను ఎంపిక చేయలేదని రాయుడు అన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఎం ఎస్ కే స్పందించాడు. ‘సెలెక్షన్ కమిటీల మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. వారితోపాటు కెప్టెన్ కూడా ఉంటాడు. ఎవరో ఒక్కరి నిర్ణయాన్ని అంతా ఒప్పుకుంటారా? లేక అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారా?’ అని ప్రశ్నించాడు. ‘ఎవరో ఒక్కరు డెసిషన్ తీసుకోగలిగితే.. ఇక ఐదుగురు సెలెక్టర్లు ఎందుకు? అంటే సెలెక్షన్ కమిటీ అంగీకరించకుండా ఏ నిర్ణయం తీసుకోలేమనే కదా అర్థం.

నేను ఏమైనా ప్రపోజ్ చేయొచ్చు. కానీ వేరే వాళ్లు దాన్ని ఒప్పుకోవాలి. కమిటీలో ఏ ఒక్కరి నిర్ణయం కూడా నిలవదు’ అని ప్రసాద్ తేల్చిచెప్పాడు. రాయుడును ఎంపిక చేయకపోవడం అనేది సెలెక్షన్ కమిటీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశాడు. అలాగే ఆంధ్ర టీంకు ఆడే సమయంలో రాయుడితో విభేదాల గురించి కూడా ప్రస్తావించాడు. ‘ఒక టీంలో చాలా కాలం ఆడినప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అన్నదమ్ముల మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తాయి కదా. భారత జట్టు ఎంపిక చేయడం వంటి విషయంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలను పెద్దవి చేయాల్సిన అవసరం ఏముంటుంది?’ అని ప్రసాద్ ప్రశ్నించాడు.

వరల్డ్ కప్ ముందు ఆడిన మ్యాచుల్లో రాయుడిని సెలెక్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. ‘వరల్డ్ కప్ ముందు జరిగిన అన్ని మ్యాచులకు రాయుడిని ఎంపిక చేశాం. అప్పుడు ఎలాంటి సమస్య లేనప్పుడు.. ప్రత్యేకంగా వరల్డ్ కప్ సెలెక్షన్‌లో సమస్య ఏముంటుంది? సెలెక్షన్ ప్రక్రియ అంతా కమిటీ మొత్తం కలిసి తీసుకునే నిర్ణయం. ఎవరో ఒక్కరి నిర్ణయం కాదు. ఈ విషయంలో నాపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వడానికే వచ్చా’ అని ఒక ఇంటర్వ్యూలో ఎం ఎస్ కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.