Tilak Varma: టీమిండియాను ఏలేది మన తెలుగు కుర్రాడే..! తమ్ముళ్లూ ఇది రాసి పెట్టుకోండి!!

మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రతిభావంతులైనా క్రికెటర్లున్నా.. కొద్దీ మంది మాత్రమే టీమిండియాకు ఆడారు. అది బీసీసీఐ చూపిన వివక్షో.. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ చేతికానితనమోనన్నది అటు ఉంచితే..భవిష్యత్‌లో మాత్రం టీమిండియానే ఏలేది మన తెలుగోడే..!తమ్ముళ్లూ ఇది గుర్తు పెట్టుకోండి..!

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 05:50 PM IST

భారత్‌ క్రికెట్‌లో అంబటి రాయుడికి జరిగిన అన్యాయం మరే క్రికెటర్‌కి జరిగి ఉండదు. రాయుడు కెరీర్ ఆరంభంలో అతని ఆట చూసి మరో సచిన్ అవుతాడని భావించారంతా. అయితే హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ పాలిటిక్స్ రాయుడికి ఆ ఛాన్స్‌ ఇవ్వనివ్వలేదు. ఎంత బాగా ఆడినా టీమిండియాలో చోటు దక్కకపోవడంతో ఇండియాన్ క్రికెట్ లీగ్‌(ICL)లోకి ఎంట్రీ ఇచ్చి రాయుడు కూడా పొరపాటు చేశాడన్నది నిజమే కావొచ్చు. అయితే రాయుడు ఆ అడుగు వేయడానికి కారణం ఎవరు? రాయుడుకి కోపం ఎక్కువని.. ఎవడ్నో కొట్టాడని.. ఎవడ్నో తిట్టాడని..ఏదేదో సాకులు చెబుతున్నారు ఇప్పుడు..! మరి టీమిండియాలో అంత శాంత కామికులు ఎవరున్నారో..? ఇటివల జరుగుతున్న ఘటనలు చూస్తుంటే గ్రౌండ్‌లో తన్నుకోవడం ఒక్కటే తక్కువైందనిపిస్తుంది..!

సరే అంబటి రాయుడి గతాన్ని మనం మార్చలేం.. దాన్ని తవ్వితీసి ఉపయోగం లేదు..! అయితే భవిష్యత్‌లో మన తెలుగు రాష్ట్రాల నుంచి టీమిండియాకి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటే ప్లేయర్‌ ఉన్నాడా అంటే.. కచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తుంది. కాంపిటేటివ్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తక్కువ కాలానికే దిగ్గజాల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఓవైపు ఫస్ట్ క్లాస్‌ క్రికెట్..మరోవైపు ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. జట్టు పీకల్లోతు కష్టాలు ఉన్నప్పుడు ఆపద్భాందవుడవుతున్నాడు. ఇలానే మనొడి ఆట కొనసాగితే భవిష్యత్‌లో టీమిండియాలో చోటు దక్కడమే కాదు.. అంతకుమించేనంటున్నారు అభిమానులు.

ముంబై ఇండియన్స్‌కి ఆడితే గ్యారెంటీ ఫ్యూచర్:
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తిలక్‌ వర్మను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. గతేడాది ఐపీఎల్‌లోనే తన టాలెంటేంటో ఐపీఎల్ ప్రపంచానికి చూపించాడు తిలక్ వర్మ. అతని ఆట చూసి దిగ్గజాలు సైతం ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్ క్రికెట్‌గా పొగడ్తల వర్షం కురిపించారు. నిజానికి ఐపీఎల్‌లో అతని ముంబై ఇండియన్స్‌కి ఆడడం అతని కెరీర్‌కు ప్లస్‌ పాయింట్‌. హర్దిక్‌ పాండ్యా, బుమ్రాలలో ప్రపంచానికి తెలియని టాలెంట్‌ను పరిచయం చేసిన ఘనత ముంబై ఇండియన్స్‌ది. ముంబైకి ఇండియన్స్‌ ఆడిన తక్కువ కాలానికే వీరిద్దరూ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా జట్టులో కీలక ఆటగాళ్లగా మారిపోయారు. ఇప్పుడు అదే జట్టుకు ఆడుతున్న తిలక్ వర్మ కూడా భవిష్యత్‌లో టీమిండియాకు ఆడడం గ్యారెంటీనేనన్న మాటలు వినిపిస్తున్నాయి..

ఐపీఎల్‌లో బ్రాండ్‌ వ్యాల్యూ కలిగిన జట్లలో ముంబై ఇండియన్స్‌ ఒకటి.. ఆ జట్టు కోచింగ్‌ స్టాఫ్‌ దగ్గర ప్లేయర్ల వరకు అందరిపై ఐపీఎల్‌ వరల్డ్ ఓ కన్నేసి ఉంచుతుంది. అలాంటి జట్టుతో జత కట్టి అదరగొడుతున్న తిలక్‌ వర్మ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ.. 45యావరేజ్‌ కలిగి ఉన్నాడు. ఏకంగా 158 స్ట్రైక్ రేట్‌తో 274 పరుగులు చేశాడు.. ఈ లెక్కలు చాలు మనోడి తిక్కేంటో చెప్పడానికి..

మొన్నటివరకు సేవియర్‌.. ఇప్పుడు ఫినిషర్‌:
తిలక్‌ వర్మలోని అన్నీ యాంగిల్స్‌ను పరిచయం చేస్తోంది ముంబై టీమ్. జట్టుకు ఏ సమయంలో ఏం కావాలో అతడితో చేయించుకుంటుంది.. కష్టాల్లో ఉన్నప్పుడు సేవియర్‌గా విలువైన పరుగులు చేస్తోన్న తిలక్‌ వర్మ..తాజాగా పంజాబ్‌పై మ్యాచ్‌లో ఫినీషర్‌ పాత్ర పోషించాడు. ఆడిన 10బంతుల్లోనే 26రన్స్ చేసిన ఈ తెలుగు కుర్రాడు.. అర్షదీప్ సింగ్‌పై స్వీట్ రివేంజ్‌ తీర్చుకున్నాడు. గత నెల 22న పంజాబ్‌పై జరిగిన పోరులో అర్షదీప్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు తిలక్‌. తాజాగా అదే అర్షదీప్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడమే కాకుండా అతని బౌలింగ్‌లోనే మ్యాచ్‌ను ఫినీష్‌ చేసి రోహిత్ టీమ్‌కు అదిరిపోయే విక్టరీనందించాడు. ఇలా మొన్నటివరకు తిలక్‌వర్మలో యువరాజ్‌ సింగ్‌ను చూసుకున్న అభిమనులు.. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్‌ ధోనీని చూశామంటూ తెగ మురిసిపోతున్నారు.

నిజానికి యువీ రిటైర్‌మెంట్ తర్వాత వన్డేల్లో నంబర్‌ 4 స్థానాన్ని ఆ రేంజ్‌లో భర్తీ చేసే ఆటగాడు మనకు దొరకలేదు. ఆ ప్లేస్‌లో సెట్‌ అయిన అంబటిరాయుడిని అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేయలేదు అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ MSK ప్రసాద్‌. ఏదో 3డీ, 4డీ ప్లేయర్లంటూ వేరే ఆటగాళ్లకు ఛాన్స్‌ ఇచ్చి మనోడి కెరీర్‌ను కంపు చేసేశాడన్నది ఫ్యాన్స్ వాదన.. అయితే తిలక్‌ విషయంలో ఆ తప్పు జరగకపోవచ్చు.. ఎందుకంటే ఇప్పుడు తిలక్‌ టాలెంట్‌ ఏంటో అందరికి తెలిసిపోయింది.. ప్రస్తుత జట్టులో ప్రధాన ఆటగాళ్ల మద్దతు కూడా అతనికి ఉన్నట్లే కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే టీమిండియాకు నిజంగా మరో యువరాజ్‌ దొరికినట్లే లెక్క..!