ఐపీఎల్ మెగావేలానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఏడాది చివర్లో జరగనున్న వేలం కోసం ఎవరిని రిటైన్ చేసుకోవాలన్న దానిపై అన్ని ఫ్రాంచైజీలు దాదాపు క్లారిటీ తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. ఆయా టీమ్స్ అధికారికంగా ప్రకటించకున్నా ఈ లోపే పలు వార్తలు షికారు చేస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును వీడుతున్నట్టు , కోల్ కతా అతనికి భారీ ఆఫర్ ఇచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ముంబై ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు స్పందించారు. సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తోనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చారు. అతను వెళ్ళిపోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే రోహిత్ శర్మ గురించి మాత్రం ముంబై ఫ్రాంచైజీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీ వర్గాల మాటలను చూస్తే సూర్యకుమార్ ఆ జట్టులోనే కొనసాగడం ఖాయమైంది. అదే సమయంలో రోహిత్ శర్మ వీడిపోతాడన్న వార్తలకు బలం చేకూరింది. గత ఏడాది ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్థిక్ ను తీసుకున్న ముంబై రోహిత్ ను తప్పించి జట్టు పగ్గాలు అప్పగించింది. హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం ముంబై ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. దీంతో గ్రౌండ్ లో హార్థిక్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు ముంబై జట్టు పేలవ ప్రదర్శనతో మరింత నిరాశపరిచింది. యాజమాన్యం తీరుపై అసంతృప్తితో ఉన్న రోహిత్ ఈ సారి వేలంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.