Rahul Dravid: భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గతంలో పలు యాడ్స్ చేసినా రెండేండ్ల క్రితం చేసిన ‘క్రెడ్’ యాడ్ బాగా పాపులర్ అయింది. ‘ఇందిరానగర్ కా గూండా’ అంటూ ద్రవిడ్ సందడి చేశాడు. ఈ యాడ్‌లో ఫుల్ ఫ్రస్ట్రేషన్ మోడ్‌లో ఉండే ద్రవిడ్.. తన చుట్టు పక్కల ఉన్న కార్ల అద్దాలను పగలగొడుతుంటాడు. అయితే ద్రవిడ్ చేసిన ఈ యాడ్‌లో అద్దాలను పగలగొట్టడాన్ని చూసి ఆయన తల్లి ఆశ్చర్యపోయిందట. అసలు అలా చేసింది నువ్వేనా..? అని ఇప్పటికీ అడుగుతుందని ద్రవిడ్ అన్నాడు.
ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఆ యాడ్ చేసిన తర్వాత చాలా మంది నన్ను చూసే విధానం పూర్తిగా మారింది. నేను ఎప్పుడు ఎలా భగ్గుమంటానో అని భయపడుతుంటారు. కానీ ఆ యాడ్‌కు మాత్రం చాలా మంచి స్పందన వచ్చింది. చాలా మంది దానిని పాజిటివ్‌గానే తీసుకున్నారు. అలా వస్తుందని నేను కూడా ఊహించలేదు. యాడ్ చూసినవాళ్లంతా పాజిటివ్ గానే స్పందించినా మా అమ్మ మాత్రం ఇప్పటికీ నమ్మదు. నేను అంత ఆవేశంతో ఊగిపోతూ కారు అద్దాలను పగలగొడతానంటే ఇప్పటికీ నమ్మడం లేదు. ఆ యాడ్ చూసినప్పుడల్లా.. ‘నిజంగా నువ్వు అలా ఆలోచిస్తున్నావా..?’ అని అడుగుతుంది..’’ అని తెలిపాడు. ముంబైలో చుట్టూ ప్రజల ముందు ఆ యాడ్ చేయడం తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని, తన లైఫ్‌లో అంత ఇబ్బందిపడి తీసిన యాడ్ ఇదేనని ‘ది వాల్’ చెప్పాడు.
‘నేను చేసిన యాడ్స్ అన్నింటిలోకెల్లా దీనికి చాలా ఇబ్బందిపడ్డా. ఆ యాడ్‌ను ముంబై వీధుల్లో చిత్రీకరించారు. పేరుకు ఇది యాడ్ అయినా చుట్టుపక్కల జనం, యాక్టర్లు, ఇతరులు చాలా మంది నా చుట్టే ఉన్నారు. వాళ్లందరి మధ్య అలా అరుస్తూ, గోల చేస్తూ, నడిరోడ్డులో నిల్చుని అరవడం నాకే చాలా ఇబ్బందికరంగా అనిపించింది.. చూసేవాళ్లకు కూడా అది ఇబ్బందే..’ అంటూ వివరించాడు.