Nathan Lyon : నా గురువు అతడే..

ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున ఆడిన గొప్ప స్పిన్నర్లలో నాథన్‌ లైయన్‌ ఒకడు. ఈ 36 ఏళ్ల ఆఫ్‌ స్పిన్నర్‌ టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో ఘనత అందుకోవడానికి నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. మరో నాలుగు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు.

ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున ఆడిన గొప్ప స్పిన్నర్లలో నాథన్‌ లైయన్‌ ఒకడు. ఈ 36 ఏళ్ల ఆఫ్‌ స్పిన్నర్‌ టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో ఘనత అందుకోవడానికి నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. మరో నాలుగు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. డిసెంబరు 14 నుంచి ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ మధ్య జరిగే తొలి టెస్టులో నాథన్ లైయన్‌ ఈ ఫీట్‌ని అందుకునే అవకాశం ఉంది. భారత వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. అతడు మరో 11 వికెట్లు పడగొడితే టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ఈ నేపథ్యంలో భారత వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌పై నాథన్‌ లైయన్ ప్రశంసలు కురిపిస్తూ వరల్డ్ క్లాస్ బౌలర్‌ అని కితాబిచ్చాడు.

‘‘అశ్విన్‌ను అతడు కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి నిశితంగా గమనిస్తున్నా. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. ప్రపంచంలోని వివిధ పరిస్థితులలో మేము చాలా మ్యాచ్‌లు ఆడాం. నాకు అతడి పట్ల, అతడు సాధించిన ఘనతలపై గౌరవం తప్ప మరో అభిప్రాయం లేదు. వేరే దేశాలతో ఆడినపప్పుడు ఆయా ఆటగాళ్ల నుంచి పలు విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కచ్చితంగా అశ్విన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా. తెలియకుండానే అతడు నాకొక కోచ్‌గా మారాడు. మేమిద్దరం 500 వికెట్ల రికార్డుకు చేరువ కావడం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణం ఎక్కడితో ముగుస్తుందో చూద్దాం. జీవిత చరమాంకంలో మేమిద్దరం ఒక దగ్గర కూర్చుని మంచి భోజనాన్ని ఆరగిస్తూ కెరీర్‌ ఎలా సాగిందనే విషయంపై చర్చిస్తామని ఆశిస్తున్నా’’ అని నాథన్‌ లైయన్‌ వివరించాడు.