‍Neeraj Chopra: బళ్ళెం బాహుబలి

13 ఏళ్ల వయసులో 80 కిలోల బరువు.. అరే టుంబూ అంటూ చుట్టు పక్కలవాళ్ల హేళన.. కన్న బిడ్డ బరువును చూసి ఆందోళన పడ్డ కుటుంబ సభ్యులు.. అలా ఒబిసిడిటీ వ్యాధితో బాధపడిన ఆ చిన్నారి మరో 10 ఏళ్లకు ఒలింపిక్స్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత వరుసగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం, స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు.

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 02:33 PM IST

13 ఏళ్ల వయసులో 80 కిలోల బరువు.. అరే టుంబూ అంటూ చుట్టు పక్కలవాళ్ల హేళన.. కన్న బిడ్డ బరువును చూసి ఆందోళన పడ్డ కుటుంబ సభ్యులు.. అలా ఒబిసిడిటీ వ్యాధితో బాధపడిన ఆ చిన్నారి మరో 10 ఏళ్లకు ఒలింపిక్స్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత వరుసగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం, స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. వరల్డ్ నెంబర్ వన్ జావెలిన్ త్రో అథ్లెట్‌గా నిలిచాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. భారత కీర్తిపతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడించేలా చేశాడు. అతనే భారత గోల్డ్‌మన్.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.! అవును ఇప్పుడు చూడటానికి బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నా.. చిన్నప్పుడు నీరజ్ చోప్రా అధిక బరువుతో బాధపడ్డాడు. టామ్ బాయ్‌లా ఉన్న నీరజ్ చొప్రాను చుట్టు పక్కల వాళ్లు హేళన చేసేవారు. నీరజ్ చోప్రా బరువు పట్ల అతని కుటుంబ సభ్యుల కూడా ఆందోళనకు గురయ్యారు.

నీరజ్ చోప్రా బాబాయ్ బీమ్ చోప్రా అతని బరువు ఎలాగైనా తగ్గించాలని పానిపట్ స్పోర్ట్స్ స్టేడియానికి తీసుకెళ్లాడు. అక్కడ జిమ్‌లో చేర్పించి అతని వెన్నును సరిచేయాలని కోచ్‌లకు సూచించాడు. పిల్లలంతా నీరజ్‌ బరువు ఎక్కువగా ఉన్నాడని టామ్ బాయ్ అంటూ గేలి చేసేవారు. అది చూసినప్పుడు నాకు బాధ కలిగేది. దాంతో అతన్ని జిమ్‌లో చేరిస్తే కొంత బరువైన తగ్గుతాడని అనిపించింది. ‘అని భీమ్ చోప్రా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. జిమ్‌ సెషన్ తర్వాత నీరజ్ చోప్రా పానిపట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌కు వెళ్లడం ప్రారంభించాడు. ‘అసలు నీరజ్ జావెలిన్ విసురుతున్నాడనే విషయమే మాకు తెలియదు. ఒక రోజు స్థానిక న్యూస్ పేపర్‌లో అతని ఫోటో చూసి షాకయ్యాం. నీరజ్ చోప్రా అంతర్ జిల్లా పోటీల్లో గెలిచినట్లు వార్త వచ్చింది. అప్పుడే అతను జావెలిన్ త్రో సాధన చేస్తున్నాడనే విషయం తెలిసింది. వాస్తవానికి మా కుటుంబంలో ఎవరికీ జావెలిన్ త్రో అంటే ఏంటో కూడా తెలియదు. అసలు అది ఒక ఆటనే విషయం కూడా మాకు అవగాహన లేదు.’అని భీమ్ చోప్రా తెలిపాడు. అయితే నీరజ్ చోప్రా తన సీనియర్ అయిన జైవీర్ దగ్గర జావిలిన్ త్రో ఆట నేర్చుకున్నాడు. అతనే నీరజ్ చోప్రాకు జావిలిన్ త్రో ఓనమాలు నేర్పాడు.

అతని వద్దే నీరజ్ చోప్రా 2011 వరకు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు తన ట్రైనింగ్‌ను పంచుకులలోని టౌ దేవీ లాల్ స్టేడియానికి మార్చాడు. 2015 నేషనల్ క్యాంప్ నుంచి పిలుపు వచ్చే వరకు అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు. 2016లో పొలాండ్ వేదికగా జరిగిన అండర్-20 అథ్లెటిక్స్ పోటీల్లో నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. దాంతో అథ్లెటిక్స్ సర్కిల్లో అతని పేరు మారుమోగింది. తన మారుమూల గ్రామమైన ఖంద్రాకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆటలో మరింత మెరుగైన నీరజ్ చోప్రా.. 2016‌లో గౌహతీ వేదికగా జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్‌, భువనేశ్వలో నిర్వహించిన ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ నెగ్గాడు. 2018లో చైనా వేదికగా జరిగిన ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్ అథ్లెటిక్స్ మీట్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. జకార్త వేదికగా జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతను వెనక్కి చూసుకోలేదు.

ఇక ఇప్పుడు, భారత జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పసిడి పతకాన్ని అందుకుని మరో చరిత్ర సృష్టించాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో భారత బళ్లెం వీరుడు.. జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి అదరగొట్టాడు. ఈ గెలుపుతో వరల్డ్ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్‌ చరిత్ర సృష్టించాడు.