Sanju Samson: అర్హత పేరుతో సంజూకి అన్యాయం.. టీమిండియా మారదా ఇక..?

టీమిండియాకు ఇప్పుడు తిలక్ వర్మ కంటే శాంసన్ అవసరమే ఎక్కువగా ఉంది. వికెట్ల వెనుక కీపింగ్ చేయడంతో పాటు మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సత్తా శాంసన్ సొంతం. ఇదే అంశంపై టీమిండియా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 05:10 PM IST

Sanju Samson: ఆసియా కప్ కోసం సెలక్ట్ చేసిన జట్టులో సంజు శాంసన్‌కి రిజర్వ్ ప్లేయర్‌గా అవకాశం దక్కింది. అయితే 17 మంది ప్రాబబుల్స్‌లో సెలక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా శాంసన్‌కి నిరాశ మాత్రం తప్పలేదు. ఇదే క్రమంలో ఒక్క వన్డే కూడా అనుభవం లేని తెలుగు కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు. ఫామ్‌లో ఉన్న తిలక్‌ని ఎంపిక చేయడం తెలుగు అభిమానులకి సంతోషం కలిగించినా.. టీమిండియాకు ఇప్పుడు తిలక్ వర్మ కంటే శాంసన్ అవసరమే ఎక్కువగా ఉంది. వికెట్ల వెనుక కీపింగ్ చేయడంతో పాటు మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సత్తా శాంసన్ సొంతం.

ఇదే అంశంపై టీమిండియా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించారో.. లేదో తెలియని శ్రేయస్ అయ్యర్, రాహుల్ మీద నమ్మకముంచారు. కానీ, శాంసన్‌ని మాత్రం మన సెలక్టర్లు పట్టించుకోలేదు. ఇక తిలక్ వర్మ విషయంలో సెలక్టర్లు కాస్త తొందరపడినట్లుగానే కనిపిస్తుంది. తిలక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడిని అధిగమించగలడా..? లేదా..? అనే సందేహం కూడా లేకపోలేదు. ఇషాన్ కిషాన్ రూపంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఉన్నా.. మిడిల్ ఆర్డర్‌లో ఆడిన అనుభవం కిషన్‌కి లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వన్డేల్లో పేలవ ఫామ్‌లో ఉన్నా సూర్య కుమార్ యాదవ్‌కి కూడా ఆసియా కప్‌లో ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఎలా చూసుకున్నా సంజూకు జట్టులో కావాలనే ఛాన్స్ ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సంజు శాంసన్ టీ 20లో విఫలమైనా.. వన్డేల్లో మాత్రం ఎప్పటికప్పుడూ తనని తాను నిరూపించుకుంటూనే వస్తున్నాడు. ఇప్పటివరకు 13 వన్డేలు ఆడిన శాంసన్ 390 పరుగులు చేసాడు.

యావరేజ్ 55 ఉండడం విశేషం. దక్షిణాఫ్రికా మీద గతేడాది లక్నోలో ఆడిన సంచలన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మ్యాచులో టీమిండియా ఓడిపోయినా 63 బంతుల్లోనే 86 పరుగులు చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు. పటిష్టమైన దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొంటూ సహచరులు విఫలమైనా తాను మాత్రం ఒంటరి పోరాటం చేసాడు. అవకాశమిస్తే ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటానికి సంజు శాంసన్ సిద్ధంగా ఉన్నాడు. మరి ఆసియా కప్‌లో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన సంజు శాంసన్‌ని వరల్డ్ కప్‌లోనైనా 15 మంది స్క్వాడ్‌లో అవకాశం కల్పిస్తారో.. లేదో చూడాలి.