World Cup: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్..! ఐసీసీ వన్డే ప్రపంచకప్ టికెట్ల రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచే మొదలవుతోంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 3:30 గంటలకు టికెట్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభిమానులు www.cricketworldcup.com/register వెబ్‌సైట్లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందరికన్నా ముందు టికెట్ల సమాచారం వారికే వస్తుంది. దాంతో సులువగా టికెట్లు పొందొచ్చు. అలాగే అభిమానుల నుంచి డిమాండ్‌ను అంచనా వేయడానికి నిర్వాహకులకు వీలవుతుంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లు, ఆటగాళ్లు తలపడే ఈ పోటీలను వీక్షించేందుకు ఫ్యాన్స్ నుంచి ఎంత పోటీ ఉంటుందో తెలిసిందే. మెగా టోర్నీకి సరిగ్గా 40 రోజుల ముందు, అంటే ఆగస్టు 25 నుంచి టికెట్ల విక్రయం చేపడతామని ఐసీసీ గతంలో తెలిపిన నేపథ్యంలో, రీషెడ్యూలును ప్రకటించిన తర్వాత మళ్ళీ ఈ విషయం చెప్పింది. టీమ్‌ఇండియా మినహా మిగతా అన్ని మ్యాచుల టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి మొదలవుతుంది. మొదట వార్మప్ మ్యాచుల టిక్కెట్లు, ఆ తర్వాత లీగ్ మ్యాచుల టికెట్లు అమ్ముతారు. ఆపై ఆరు దశల్లో టీమ్ ఇండియా తలపడే మ్యాచుల టికెట్లు ఇస్తారు. సెప్టెంబర్ 30న గువహటిలో ఇంగ్లాండ్, అక్టోబర్ 3న తిరువనంతపురంలో శ్రీలంక లేదా నెదర్లాండ్స్‌తో రోహిత్ సేన వార్మప్ మ్యాచులు ఆడుతుంది. మొదట ఈ పోటీల టికెట్లు అమ్ముతారు. టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించి షెడ్యూల్ వివరాలివి.
ఆగస్టు 25: టీమ్ ఇండియా మినహా మిగతా జట్ల వార్మప్, లీగ్ మ్యాచులు టికెట్ల విక్రయం
ఆగస్టు 30: గువహటి, తిరువనంతపురంలో టీమ్ ఇండియా ఆడే వార్మప్ మ్యాచుల టికెట్ల విక్రయం
ఆగస్టు 31: ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో టీమ్ ఇండియా మ్యాచుల టికెట్ల విక్రయం
సెప్టెంబర్ 1: న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో టీమ్ ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 2: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమ్ ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 3: అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచు టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 15: సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి.
‘ఆగస్టు 15న టికెట్ల విక్రయానికి ముందు అభిమానులు www.cricketworldcup.com/registerలో తమ ఆసక్తిని తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు అందరికన్నా ముందుగా వారికి టికెట్ల అమ్మకాలపై సమాచారం వస్తుంది. వన్డే ప్రపంచకప్ మ్యాచులు ప్రత్యక్షంగా చూసేందుకు వీలవుతుంది. ఆటను ఆస్వాదించొచ్చు’ అని ఐసీసీ తెలిపింది.