World Cup 2023 Venues: కొన్ని రాష్ట్రాలకు బీసీసీఐ మొండిచేయి.. వరల్డ్ కప్ మ్యాచుల నిర్వహణకు నో ఛాన్స్..!

వచ్చే అక్టోబర్ నుంచి ఇండియాలో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ జరగబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాలకు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేకుండా చేయడంపై ఆయా రాష్ట్రాలకు చెందిన క్రికెట్ సంఘాలు, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 12:24 PM IST

World Cup 2023 Venues: ఇండియాలో జరగనున్న వరల్డ్ కప్ మ్యాచుల కేటాయింపు విషయంలో బీసీసీఐపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేకుండా చేయడంపై ఆయా రాష్ట్రాలకు చెందిన క్రికెట్ సంఘాలు, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే అక్టోబర్ నుంచి ఇండియాలో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఐసీసీ నిర్వహిస్తున్న ఈ టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లను ఇక్కడ బీసీసీఐ చూస్తుంది. మ్యాచ్ జరిగే స్టేడియంలను ఎంపిక చేయడం, వసతులు కల్పించడం వంటి బాధ్యత బీసీసీఐ తీసుకుంటుంది. టోర్నీలో ఏ మ్యాచ్ ఎక్కడ జరగాలో నిర్ణయించాల్సింది బీసీసీఐ. ఈ టోర్నీకి ఇప్పటికే బీసీసీఐ పది స్టేడియంలను ఎంపిక చేసింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లోని స్టేడియంలకు ఒక్క మ్యాచ్ కూడా కేటాయించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
48 మ్యాచులున్నా..
దాదాపు 48 మ్యాచులు జరిగే టోర్నీలో వసతులు ఉన్న ప్రతి స్టేడియానికి ఒక్క మ్యాచ్ అయినా కేటాయించాల్సింది అని అక్కడి ఫ్యాన్స్ అడుగుతున్నారు. నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించేందుకు దేశంలో పదికంటే ఎక్కువ స్టేడియంలకే అవకాశం ఉంది. అలాంటి వసతులు ఉన్న మొహాలీ, ఇండోర్, తిరువనంతపురం, విశాఖపట్నం వంటి స్టేడియంలను బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఈ స్టేడియంలలో గతంలో వన్డే, టెస్ట్ మ్యాచులెన్నో జరిగాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్నాయి. అయినా వీటిని ఎంపిక చేయకపోవడంతో స్థానిక ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత మైదానంలో ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ అయినా చూద్దామనుకున్న స్థానిక ప్రేక్షకులకు బీసీసీఐ నిర్ణయం నిరాశ కలిగించింది. ఇది బీసీసీఐ చూపిన వివక్షే అని కొందరు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కొందరైతే.. ఇది బీజేపీ నిర్ణయమే అని, కుట్రతో తమకు మ్యాచులు కేటాయించలేదని మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌కు మూడు మ్యాచులు కేటాయించారు. అయితే, అందులో ఇండియాకు సంబంధించిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. ప్రపంచ కప్ కోసం పది స్టేడియంలను ఎంపిక చేయగా.. అందులో హైదరాబాద్ ఒకటి. కానీ, హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది స్టేడియంలలో ఏదో ఒక ఇండియా మ్యాచ్ జరుగుతుంది. ఈ విషయంలో హైదరాబాద్‌కు మాత్రం మొండిచేయి చూపించింది బీసీసీఐ. ఇక్కడ పాకిస్తాన్ రెండు మ్యాచులు, న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఆడుతుంది. ఇండియా మ్యాచ్ ఒక్కటీ లేకపోవడంతో స్థానిక ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 15 స్టేడియంలలో మ్యాచులు
అయితే, ఇదంతా ఐసీసీ సూచన ప్రకారమే జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఎన్ని వేదికల్లో మ్యాచులు నిర్వహించాలి అనే విషయం ఐసీసీ చెప్పదు. ఈ విషయంలో స్థానికంగా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి. దీని ప్రకారం బీసీసీఐ అన్ని ప్రధాన స్టేడియంలలో మ్యాచ్‌ల నిర్వహణకు ప్రయత్నించాల్సింది. ఇంగ్లండ్‌లో 2019లో వరల్డ్ కప్ జరిగినప్పుడు 11 స్టేడియంలలో మ్యాచులు నిర్వహించారు. ఇంగ్లండ్ చిన్న దేశం కాబట్టి, విమానాలతో పని లేకుండానే ఆటగాళ్లు ప్రయాణం చేసి, స్టేడింయలకు చేరుకున్నారు. అంతకుముంద 2015 నాటి వరల్డ్ కప్‌ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు 15 స్టేడియంలలో మ్యాచులు నిర్వహించారు. బీసీసీఐ కూడా 15 స్టేడియంలోనైనా మ్యాచులు నిర్వహించాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తక్కువ స్టేడియంలలో మ్యాచులు నిర్వహిస్తే రవాణా, ఇతర ఖర్చులు తగ్గుతాయని భావించి ఉండొచ్చు. పైగా ఇండియా లాంటి పెద్ద దేశంలో మ్యాచులను అన్ని చోట్లా నిర్వహిస్తేనే ప్రేక్షకులకు మరింత చేరవవుతుంది. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణ‍యం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గుజరాత్‌కే ప్రాధాన్యం..
టోర్నీ, ప్రారంభ ముగింపు మ్యాచులు రెండింటికీ గుజరాత్ (అహ్మదాబాద్)లోని నరేంద్ర మోదీ స్టేడియంను ఎంపిక చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌కే చెందిన అమిత్ షా కొడుకు జైషా నిర్ణయం మేరకే ఈ స్టేడియానికి ప్రాధాన్యమిచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ స్టేడియం దేశంలోనే నాలుగో అతిపెద్ద స్టేడియం అని, ముంబై, అహ్మదాబాద్‌తో పోలిస్తే ఇక్కడ పొడి వాతావరణం ఉంటుందని, అలాంటిది సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులను హైదరాబాద్‌లో నిర్వహించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. క్రికెట్‌ నిర్వహణలో గుజరాత్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కూడా బీసీసీఐ తీరును తప్పుబడుతున్నాయి.