ఈ పర్యటనలో టీమిండియా తరపున చాలా మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన రాజస్తాన్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, కేకేఆర్ ఆల్ రౌండర్ రింకూసింగ్‌లకు భారత టీ20 జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అదే విధంగా రుత్‌రాజ్ గైక్వాడ్, వెటరన్ పేసర్ మోహిత్ శర్మ కూడా రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక జైశ్వాల్, రింకూతో పాటు మరో యువ ఆటగాడు టీ20ల్లో టీమిండియా తరపున డెబ్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడెవరో కాదు చెన్నైసూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్ పాండే.
దేశ్‌పాండే ఈ ఏడాది సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో తుషార్ ఆరో స్ధానంలో నిలిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 21 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసే సత్తా తుషార్‌కు ఉంది. కాగా ఈ సిరీస్‌కు స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి పేసర్లతో దేశ్‌పాండే బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక జూలై 12 డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత పర్యటన ప్రారంభం కానుంది.