Asia Cup: క్యాసినోలో దొరికిపోయారు.. ఐసీసీ సీరియస్ వార్నింగ్..

పాక్‌ జట్టు మీడియా మేనేజ‌ర్ ఉమ‌ర్ ఫారూక్ క‌ల్స‌న్‌తో పాటు పీసీబీ బోర్డుకు చెందిన జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అద్న‌న్ అలీ కొలంబోలోని క్యాసినోకు వెళ్లి కెమెరా కంటికి చిక్కారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ క్యాసినోకు వెళ్లడం తీవ్ర వివాదస్పదమైంది.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 05:38 PM IST

Asia Cup: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మరోసారి చిక్కుల్లో పడింది. ప్రస్తుతం పాక్‌ జట్టు ఆసియాకప్‌-2023లో భాగంగా శ్రీలంకలో ఉంది. ఈ మెగా టోర్నీ సూపర్‌-4లో భాగంగా ఆదివారం భారత్‌తో తలపడేందుకు రెండు రోజుల ముందే కొలంబోకు పాకిస్తాన్ చేరుకుంది. ఈ క్రమంలో పాక్‌ జట్టు మీడియా మేనేజ‌ర్ ఉమ‌ర్ ఫారూక్ క‌ల్స‌న్‌తో పాటు పీసీబీ బోర్డుకు చెందిన జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అద్న‌న్ అలీ కొలంబోలోని క్యాసినోకు వెళ్లి కెమెరా కంటికి చిక్కారు.

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ క్యాసినోకు వెళ్లడం తీవ్ర వివాదస్పదమైంది. కాగా ఈ విషయాన్ని ఐసీసీ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ఓ జట్టు అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు ఆ టీమ్‌కు సంబంధించిన ఆటగాళ్లు గానీ, అధికారులు గానీ క్యాసినోలకు వెళ్లి గ్యాంబ్లింగ్‌లో పాల్గొనడంపై నిషేధం ఉంది. అయితే క్యాసినోకు వెళ్లిన ఆ ఇద్దరి వ్యక్తుల వాదన మాత్రం మరో విధంగా ఉంది. కేవ‌లం డిన్న‌ర్ కోస‌మే తాము క్యాసినోకు వెళ్లిన‌ట్లు ఆ ఇద్ద‌రూ పాక్ మీడియాకు వెల్ల‌డించారు.

ఎవరైనా ఫుడ్‌ కోసం హోటల్‌కు వెళ్తారు గానీ క్యాసినో సెంటర్‌కు వెళ్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక కొలంబో వేదికగా రిజర్వ్‌ డే అయిన సోమవారం భారత్‌-పాకిస్తాన్‌ సూపర్‌-4 మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.