PAK A vs SL: ఏ ఫార్మాట్‌లో అయినా సరే విజయం తెచ్చే మజానే వేరు. అదే ఏడాదిగా ఒక ఫార్మాట్‌లో రుచి చూడని విజయం ఎట్టకేలకు దక్కితే? అదే మజాను ప్రస్తుతం పాకిస్తాన్ టీం అనుభవిస్తోంది. ఇటీవలి కాలంలో వన్డేలు, టీ20ల్లో బలమైన జట్టుగా ఎదిగిన పాకిస్తాన్.. పాల్గొన్న ప్రతి టోర్నీలో ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది.
కానీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మాత్రం చాలా పేలవ ప్రదర్శన చేసింది. గడిచిన ఏడాది కాలంలో పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. మహా అయితే మ్యాచులు డ్రా చేసుకోగలిగిందే కానీ.. ఒక్క టెస్టు విజయం కూడా రుచిచూడలేదు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన టెస్టులో పాకిస్తాన్ అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. ఏడాది తర్వాత దక్కిన ఈ టెస్టు విజయంతో పాక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అంతేకాదు, కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌లో తొలి విజయం సాధించిన పాకిస్తాన్.. పాయింట్ల పట్టికలో భారత్ సరసన చేరింది. ఈ సైకిల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు జట్లు 100 శాతం పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 61.11 శాతం పాయింట్లతో ఆస్ట్రేలియా ఉంది.