World Cup 2023: వరల్డ్ కప్‌లో పాక్ పాల్గొనడంపై సందేహాలు.. పాక్ జట్టు ఇండియాకి వస్తుందా.. రాదా..?

పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ బెట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ తర్వాత ప్రపంచ కప్ జరుగుతుంది. ఇండియాలో జరిగే ప్రపంచ కప్‌లో పాక్ పాల్గొంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 09:46 AM IST

World Cup 2023: అక్టోబర్‌లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ మెగా గ్రాండ్ టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాక్ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పాల్గొంటుందా.. లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

ఎందుకంటే ఈ టోర్నీ ఇండియాలో జరగడమే. పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ బెట్టు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వెళ్లేందుకు ఇండియా ఇష్టపడలేదు. దీంతో టోర్నీ వేదికను మార్చాల్సి వచ్చింది. ఆసియా కప్ తర్వాత ప్రపంచ కప్ జరుగుతుంది. ఇండియాలో జరిగే ప్రపంచ కప్‌లో పాక్ పాల్గొంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ మ్యాచులకు సంబంధించి డేట్స్, వేదికలు కూడా ఖరారయ్యాయి. కానీ, పాక్ ఇండియా రావాలంటే అక్కడి ప్రభుత్వ అనుమతి కూడా రావాలి. పాక్ ప్రభుత్వం అనుమతిస్తేనే ఆ జట్టు ఇండియాలో అడుగుపెడుతుందని పీసీబీ చీఫ్ నజాం సేథి గతంలో చెప్పారు. ఈ విషయంలో ఇంకా ప్రభుత్వ అనుమతి రావాలి. పాక్ రాకపోతే.. ఆ దేశంతో జరిగే మ్యాచ్ వేదికలను మార్చాలి అని కోరే అవకాశం ఉంది.

దీనికి ఐసీసీ, బీసీసీఐ అంగీకరించాలి. అదంతా సాధ్యమయ్యే పని కాదు. ఇండియాలో పాకిస్తాన్ జట్టు అడుగుపెట్టాలంటే అక్కడి ప్రభుత్వం అనుమతివ్వాలి. లేదంటే పాక్ ఆడే మ్యాచ్ వేదికలను ఇండియాలో కాకుండా మరో దేశానికి మార్చాలి. ఈ రెండూ జరిగితేనే పాక్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటుంది. లేకపోతే పాక్ జట్టు టోర్నీని బహిష్కరించే అవకాశం ఉందని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్ ప్రభుత్వం జట్టును అనుమతించే విషయంలో చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది అక్కడి రాజకీయ, సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న అంశం. అందువల్ల తమ రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అప్పటివరకు పాక్ జట్టు ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై సందేహాలు కొనసాగుతూనే ఉంటాయి.