టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్ కు ఆదరణ తగ్గింది.. అటు అభిమానుల్లోనే కదా ఇటు ఆటగాళ్ళలోనూ రెడ్ బాల్ ఫార్మాట్ పై ఆసక్తి అంతగా కనిపించడం లేదు. ఎందుకంటే టెస్టుల్లో ఆడడం అంత సులభం కాదు. టీ ట్వంటీల్లోలా వచ్చిన వెంటనే నాలుగు భారీ షాట్లు బాదేసి వెళ్ళిపోదామంటే కుదరదు. టెస్టుల్లో ఆడాలంటే ఎంతో ఓపిక ఉండాలి… అసలు ఏ బ్యాటర్ అసలైన సత్తా బయటకొచ్చేది టెస్ట్ ఫార్మాట్ తోనే… ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టు నిలకడగా సుధీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుత యువక్రికెటర్లలో ఇలాంటి ఆటతీరు అంతగా కనిపించడం లేదు. అయితే చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ టెస్టుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో ఆడి చూపించారు.
67 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన వీరిద్దరూ మూడోరోజు అదరగొట్టారు. పరిస్థితులకు తగ్గట్టే ఆడుతూ భారీ ఆధిక్యాన్ని అందించారు. ఇక్కడ వ్యక్తిగత సెంచరీల కంటే కూడా మరో వికెట్ చేజారకుండా మ్యాచ్ పై పట్టుబిగించడమే లక్ష్యంగా వీరిద్దరి ఆటతీరు సాగింది. ఇష్టానుసారం భారీ షాట్లు కొట్టకుండా చెత్త బాల్స్ ను మాత్రమే ఆడుతూ ఓపికగా బలమైన పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో శతకాలు కూడా సాధించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ లు ఎప్పుడూ స్పెషలే.. అలాంటి స్పెషల్ ఇన్నింగ్స్ లతో అదరగొట్టిన పంత్ , గిల్ జోడీపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.