R Praggnanandhaa: మాగ్నస్ కార్ల్‌సన్.. దశాబ్దకాలంగా పరాజయం కూడా తెలియకుండా ప్రపంచ చెస్‌ను ఏలుతున్న మహారాజు! విశ్వనాథన్ ఆనంద్ సహా ఎందరో దిగ్గజాలు అతడి ధాటికి నిలవలేకపోయారు. వాల్డ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా టైటిళ్లు గెలిచి గెలిచి.. విజయం కూడా బోర్ కొట్టేసిన ఆటగాడు. ఆ టోర్నీ ఆడను అంటూ పోటీ నుంచే తప్పుకొని సంచలనం క్రియేట్ చేసిన ప్లేయర్. అలాంటి ఆటగాడిని ఏడాదికాలంలో మూడుసార్లు ఓడించిన సంచలన క్రీడాకారుడు ప్రజ్ఞానంద.
కేవలం 12 ఏళ్ల 10 నెలల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ అయి.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా నిలిచాడు. అది మొదలు భారత చెస్‌లో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కుర్రాడిని చెస్‌లోకి తీసుకొచ్చింది, ఇప్పటికీ తన వెంటే ఉండి నడిపిస్తోంది అతని తల్లి నాగలక్ష్మినే. ప్రజ్ఞానంద తండ్రి రమేశ్ బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. ప్రజ్ఞానంద సోదరి వైశాలి ప్రస్తుతం మహిళల ఇంటర్నేషనల్ మాస్టర్. ఆమె టీవీతోనే ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తోందని తనకు చెస్ బోర్డు కొనిచ్చింది తల్లి. అదే సమయంలో ప్రజ్ఞానందకు కూడా ఈ ఆటపై ఆసక్తి కలిగింది. ఈ ఆటలోకి అడుగు పెట్టే సమయానికి తన వయసు నాలుగున్నరేళ్లే. అక్కతో కలిసి ఆడుతూ ఆటపై కాస్త పట్టు సాధించాక.. త్యాగరాజన్ అనే కోచ్ దగ్గర అతను శిక్షణకు చేరాడు. ఓన్ టాలెంట్‌కు తోడు ట్రైనింగ్ కూడా దొరకడంతో చిన్న వయసులోనే పెద్ద వాళ్ల మీద గెలుస్తూ ఆటలో ఎదిగాడు. ప్రజ్ఞానంద టాలెంట్‌కు ఆనంద్ సహా ఎందరో సాహో అనేశారు. ఏకంగా అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి.. ప్రత్యర్థులకు కొరక రాని కొయ్యలా మారిన కార్ల్‌సన్‌ను 16ఏళ్ల వయసులోనే ఓడించి సంచలనం రేపాడు.
అంతే కాకుండా ఏడాది వ్యవధిలో ఇంకో రెండుసార్లు అతడిపై పైచేయి సాధించడంతో చెస్ ప్రపంచంలో తన పేరు మార్మోగింది. ఇప్పుడు చెస్ ప్రపంచకప్‌లో కరువానా లాంటి మేటి ఆటగాడిని ఓడించి కార్ల్‌సన్‌తో ఫైనల్‌లో పోటీ పడ్డాడు. ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద టాలెంట్.. దిగ్గజ క్రీడాకారుడు కాస్పరోవ్‌ను కూడా మెప్పించింది. ప్రజ్ఞానంద ఫ్యామిలీలో తెలుగు మూలాలు ఉన్నాయి. అతడి తండ్రి రమేశ్ బాబు తెలుగువారే. వీరిది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. రమేశ్‌తో పాటు ఆయన భార్య నాగలక్ష్మి కూడా తెలుగు మాట్లాడుతుంది. ఇంట్లో పెద్ద వాళ్లు తెలుగులోనే మాట్లాడుకుంటారు. ప్రజ్ఞానందకు, అతడి అక్క వైశాలికి తెలుగు అర్థమవుతుంది కానీ.. మాట్లాడలేరట.