ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగావేలంపై ఫ్రాంచైజీల కసరత్తు మొదలుపెట్టాయి. రిలీజ్ చేసే ప్లేయర్స్ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పడం లేదు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ పలువురు స్టార్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేయనుంది. 2022 వేలంలో పంజాబ్ జట్టు బెయిర్ స్టోను కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ 253 పరుగులే చేశాడు. తర్వాతి సీజన్ కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక 2024 సీజన్ లోనూ పెద్దగా రాణించకపోవడం ఫ్రాంచైజీకి నిరాశ కలిగించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జాతీయ జట్టులోనూ చోటు దక్కని బెయిర్ స్టోను పంజాబ్ రిలీజ్ చేయనుంది. అతన్ని వేలంలో మరొక ఫ్రాంచైజీ తీసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.
పంజాబ్ కింగ్స్ వదిలేసే ప్లేయర్స్ లో లివింగ్ స్టోన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. గత వేలంలో ఏకంగా 11.5 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే 2022 సీజన్ లో మాత్రమే సత్తా చాటాడు. తర్వాత రెండు సీజన్లలోనూ నిరాశపరిచాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన కేవలం 111 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో లివింగ్ స్టోన్ ను పంజాబ్ మళ్ళీ తీసుకునే పరిస్థితి కూడా లేదు. వచ్చే వేలంలో ఈ ఇంగ్లీష్ క్రికెటర్ కు అమ్ముడయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక పేస్ బౌలర్ హర్షల్ పటేల్ ను కూడా పంజాబ్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే అర్షదీప్ సింగ్ ను రిటైన్ చేసుకుంటున్న పంజాబ్ 11.75 కోట్లు పెట్టి కొన్న హర్షల్ పటేల్ ను వేలంలోకి వదిలేసేందుకు నిర్ణయించుకుంది. గత సీజన్ లో 24 వికెట్లు తీసినప్పటకీ వయసు కారణం రీత్యా అతన్ని కొనసాగించే అవకాశం లేదు. ప్రస్తుతం 33 ఏళ్ళ హర్షల్ స్థానంలో మరో యువ పేసర్ ను తీసుకోవాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది.