Rachin Ravindra: ‘ర’ అంటే రాహుల్ ద్రవిడ్ ‘చిన్’ అంటే సచిన్ టెండూల్కర్

23 ఏళ్ల కుర్రాడు డిఫెండింగ్ ఛాంపియన్ కే ముచ్చెమటలు పట్టించాడు. బజ్ బాల్ క్రికెట్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఇంగ్లండ్ జట్టుకే దూకుడు అంటే ఏంటో చూపాడు.

  • Written By:
  • Updated On - October 9, 2023 / 03:17 PM IST

Rachin Ravindra: అసలే ప్రపంచకప్.. ఆడుతుంది మెగాటోర్నీలో ఫస్ట్ మ్యాచ్.. ముందుంది డిఫెండింగ్ ఛాంపియన్.. ఏ బ్యాటర్ అయినా తడబడతాడు. కానీ.. ఈ 23 ఏళ్ల కుర్రాడు ఆ డిఫెండింగ్ ఛాంపియన్ కే ముచ్చెమటలు పట్టించాడు. బజ్ బాల్ క్రికెట్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఇంగ్లండ్ జట్టుకే దూకుడు అంటే ఏంటో చూపాడు.

అతడు ఎవరో కాదు న్యూజిలాండ్ డేరింగ్ డాషింగ్ యంగ్ గన్ రచిన్ రవీంద్ర. తన తొలి వన్డే ప్రపంచకప్‌‌ ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్యంగా ప్రమోషన్ అందుకున్న రచిన్ రవీంద్ర.. ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపాడు. బౌలర్ ఎవరైనా సరే తగ్గేదే లే అన్నట్టు విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రదర్శనతో రచిన్ రవీంద్ర.. ఓవర్ నైట్ స్టార్‌‌గా ఎదిగాడు. సోషల్ మీడియా వేదికగా రచిన్ రవీంద్ర పేరు మారుమోగుతోంది. అసలు ఈ రచిన్ రవీంద్ర ఎవరూ..? అతనికి భారత్‌తో ఉన్న సంబంధం ఏంటనే విషయంపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర.. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర స్వస్థలం భారత్‌లోని బెంగళూరు. అతని తల్లిదండ్రులు 1990లోనే న్యూజిలాండ్‌కు వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన రచిన్ రవీంద్ర.. క్రికెట్ ఓనమాలు నేర్చుకుంది మాత్రం భారత్‌లోనే. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌ను అభిమానించే తన తల్లిదండ్రులు వారిద్దరి పేర్లు కలిసేలా రచిన్ అనే పేరు పెట్టారని రచిన్ రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని రవీంద్ర వెల్లడించాడు.