Rahkeem Cornwall: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో విండీస్ జట్టు బాహుబలి బ్యాట్స్‌మెన్ రహ్కీమ్ కార్న్‌వాల్ తుఫాన్ సెంచరీతో మెరిశాడు. ఈ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ తరపున ఆడుతున్న కార్న్‌వాల్, SKN పేట్రియాట్స్ పై 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే ఇదే కార్న్‌వాల్ టోర్నీలో మునుపటి మ్యాచ్‌లో మొదటి బంతికే రనౌట్ అయ్యాడు.
ఆ క్రమంలో విపరీతంగా ట్రోల్ అయ్యాడు. అయితే ఇప్పుడు సెంచరీతో విరుచుకుపడి ట్రోల్స్‌కు తగిన సమాధానం ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ 221 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ 37 బంతుల్లో 56 పరుగులు చేయగా, మరో ఓపెనర్ విల్ స్మిత్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. వీరిద్దరితో మిడిల్ ఆర్డర్‌లో చెలరేగిన కెప్టెన్ షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్ 27 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 65 పరుగులు చేశాడు.
లక్ష్యాన్ని ఛేదించిన రాయల్స్, కార్న్‌వాల్ తుఫాన్ సెంచరీతో పాటు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 49 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో కేవలం 18.2 ఓవర్లలోనే రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు తరపున సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన దిగ్గజం కార్న్‌వాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. రాయల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన కార్న్ వాల్ మరో ఓపెనర్ మేయర్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత ఇవాన్స్‌తో కలిసి కార్న్‌వాల్ తుఫాన్ ఇన్నింగ్స్‌ని నిర్మించి కేవలం 48 బంతుల్లో 4 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ముఖ్యంగా కార్న్ వాల్ కొట్టిన రెండు సిక్సర్లు 110, 111 మీటర్ల దూరంలో పడ్డాయి. తన కటౌట్ కి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు అంటూ లైవ్ మ్యాచ్ వీక్షించిన క్రికెట్ అభిమానులు నెట్టింట్ల ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.