Rohith Sharma: రోహిత్ శర్మకు ప్రపంచ కప్ లాస్ట్.. ఆ తర్వాత వచ్చే కెప్టెన్ మామూలోడు కాదు

టీమ్‌ఇండియా వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధమైంది. దీంతో టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గురించి మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 03:01 PM IST

పాండ్యను టెస్టు క్రికెట్‌లో తిరిగి చూడలేకపోతున్నామని.. వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత అతడు వైట్‌ బాల్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని శాస్త్రి చెప్పాడు. ‘హార్దిక్‌ శరీరం టెస్టు క్రికెట్‌ను ఎదుర్కోలేకపోతోంది. ప్రపంచకప్‌ తర్వాత.. అతడు వైట్‌ బాల్‌ క్రికెట్‌ కెప్టెన్సీ చేపట్టాలని నేను భావిస్తున్నాను. వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి రోహితే సారథి. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని శాస్త్రి స్పష్టం చేశాడు.

ఇక హార్దిక్‌ను విండీస్‌తో వన్డేలకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా గాయం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని జట్టులోకి తీసుకొచ్చేందుకు తొందరపడొద్దని సెలెక్టర్లను రవిశాస్త్రి హెచ్చరించాడు. గాయం కారణంగా బుమ్రా గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్‌, WTC Final 2023లకు అతడు దూరమయ్యాడు.

ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం అతడిని జట్టులోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు.. జట్టుతోపాటు అతడికి చెడుగా మారే అవకాశం ఉందని రవిశాస్త్రి ఓ ఛానల్‌తో పేర్కొన్నాడు. ‘అతడు ఎంతో కీలకమైన బౌలర్‌. ప్రపంచకప్‌ కోసం అతడిని తొందరపెడితే.. షాహిన్‌ అఫ్రిదీ మాదిరిగా నాలుగు నెలల అనంతరం అతడి సేవలను కోల్పేయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని శాస్త్రి సూచించాడు.