ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. దాదాపు చాలా మంది టాప్ ప్లేయర్స్ ఆక్షన్ లోకి రాబోతున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించే చర్చ జరుగుతోంది. అసలు రోహిత్ ను ముంబై రిటైన్ చేసుకుంటుందా… లేదా అతనే వేలంలోకి వచ్చేస్తాడా… వస్తే ఎంత ధర పలుకుతాడు.. క్రికెట్ ఫ్యాన్స్ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రోహిత్ శర్మ ఐపీఎల్ ఫ్యూచర్ పై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్బులు రోహిత్ కు అసలు మ్యాటరే కాదన్నాడు. ముంబైని వదిలి రోహిత్ ఎక్కడికీ వెళ్లడని అనుకుంటున్నట్టు చెప్పాడు. హిట్‌మ్యాన్ లాంటి వాళ్లు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వరని తేల్చేశాడు.
అతడు టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడనీ, ముంబై ఇండియన్స్‌కు చాలా ఏళ్ళు సారథ్యం వహించాడని గుర్తు చేశాడు. కెప్టెన్సీ లేకపోయినా ముంబైకి ఆడటంలో రోహిత్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కొత్త తలనొప్పులు కావాలని ఎవరూ కోరుకోరని వ్యాఖ్యానించాడు. అయితే అశ్విన్ కామెంట్స్ తో కొందరు రోహిత్ ఫ్యాన్స్ విభేదిస్తున్నారు. ఐదు టైటిల్స్ అందించిన సారథిని అవమానకర రీతిలో తొలగించడం సరికాదంటూ చెబుతున్నారు.