ఆసియా దేశాల్లో పిచ్ లు స్పిన్ కే అనుకూలంగా ఉంటాయన్నది తెలిసిందే.. ఎంత అనుకూలంగా ఉన్న బౌలింగ్ వేరియేషన్ లేకుంటే వికెట్లు తీయలేరు.. ఇది ఎవ్వరైనా అంగీకరించాల్సిందే… ఎప్పటికప్పుడు బౌలింగ్ లో డిఫరెన్స్ చూపిస్తూ వికెట్లు తీస్తేనే స్పిన్నర్లు కూడా సక్సెస్ అయినట్టు. గత కొన్నేళ్ళుగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దీనిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే రెడ్ బాల్ క్రికెట్ లో భారత్ కు కీలకమైన స్పిన్నర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో అశ్విన్ హవా స్పష్టంగా కనిపించింది. చెపాక్ స్టేడియంలో బంతితో తిప్పేసిన అశ్విన్ బ్యాట్ తోనూ అదరగొట్టి శతకం సాధించాడు.
తర్వాత కాన్పూర్ టెస్టులోనూ తన స్పిన్ మ్యాజిక్ కంటిన్యూ చేసిన ఈ సీనియర్ స్పిన్నర్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఆరు రికార్డులను అందుకున్నాడు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే వరుసగా మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్స్‌లో 50కి పైగా వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ రెండో టెస్టులో 4 వికెట్లు పడగొట్టాక, బంగ్లాదేశ్‌పై టెస్టు మ్యాచ్‌ల్లో 33 వికెట్లు మైలురాయిని అందుకొన్నాడు. బంగ్లాదేశ్‌పై భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈక్రమంలో 31 టెస్ట్ వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇక టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన మురళీధరన్ రికార్డును కూడా యాష్ సమం చేశాడు. మురళీధరన్ తన కెరీర్ లో 11 సార్లు ఈ ఘనత సాధిస్తే… తాజాగా బంగ్లాతో సిరీస్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న అశ్విన్ లంక దిగ్గజంతో సమంగా నిలిచాడు. గత ఐదేళ్ళుగా టెస్టుల్లో అశ్విన్ ఫామ్ అత్యుత్తమ స్థాయిలో ఉంది. 2019-21 డబ్ల్యూటీసీ సీజన్ లో 71 వికెట్లు, 2021-23 సీజన్ లో 61 వికెట్లు తీసిన అశ్విన్ ఇప్పుడు 2023-25 సీజన్ లో కేవలం 10 మ్యాచ్ లలోనే 50 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో భారత్ ఇంకా 8 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో అశ్విన్ గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.