Rahul vs Tilak: కేఎల్‌ రాహుల్‌, తిలక్‌ వర్మ.. ఈ ఇద్దరిలో ప్రపంచ కప్‌కి ఎవరు బెస్ట్..?

ఐపీఎల్‌ టైమ్‌లో గాయపడ్డ రాహుల్‌ ఇలా కోలుకున్నాడో లేదో అలా ఆసియా కప్‌లో ఆడేందుకు రెడీ ఐపోయాడు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదంటున్నాడు టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి. చేసిన తప్పే పదేపదే చేయడం మంచిది కాదు. కానీ బీసీసీఐ అదే చేస్తోంది.

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 04:27 PM IST

Rahul vs Tilak: వన్డే వరల్డ్‌ కప్‌కి టైమ్‌ దగ్గర పడుతున్న వేళ జట్టు కూర్పుపై అభిమానులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ చుట్టూనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌, తిలక్‌లో ఎవరు ప్రపంచకప్‌కి అర్హులో మాజీలు కూడా తేల్చిచెబుతున్నారు.
గాయం నుంచి కోలుకోగానే మ్యాచ్‌లు ఆడిస్తే మొదటికే మోసం వస్తుంది. టీమిండియా యార్కర్‌ కింగ్‌ బుమ్రాకి ఇదే జరిగింది. బీసీసీఐ అనాలోచిత నిర్ణయాల వల్ల బుమ్రా ఇప్పటివరకు మూడుసార్లు గాయాల బారిన పడ్డాడు. ఇప్పుడు కేఎల్‌ రాహుల్ విషయంలోనూ బీసీసీఐ అదే తప్పు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఐపీఎల్‌ టైమ్‌లో గాయపడ్డ రాహుల్‌ ఇలా కోలుకున్నాడో లేదో అలా ఆసియా కప్‌లో ఆడేందుకు రెడీ ఐపోయాడు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదంటున్నాడు టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి. చేసిన తప్పే పదేపదే చేయడం మంచిది కాదు. కానీ బీసీసీఐ అదే చేస్తోంది. అక్టోబర్‌ 5 నుంచి మొదలుకానున్న వన్డే ప్రపంచ కప్‌ ఈ సారి ఇండియాలోనే జరగనుంది. ఈ టోర్నిలో టీమిండియా.. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు జట్టు కూర్పుపై క్లారిటీ లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. జట్టులో స్థానం కోసం సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్, తిలక్‌ వర్మ పోటిపడుతుండగా.. ఇటివలే గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్‌కి బీసీసీఐ రెడ్‌ కార్పెట్‌ పరిచినట్టుగా కనిపిస్తోంది. గతంలో కోహ్లీ అండదండలతో నిలకడలేకున్నా జట్టుతో కొనసాగుతూ వచ్చిన కేఎల్‌ రాహుల్‌కి ఇప్పుడు హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ మద్దతు కూడా ఉంది. అయితే 2019లో చేసిన తప్పే మళ్లీ చేయకూడదంటున్నాడు రవిశాస్త్రి.
2019లో ఏం జరిగింది..?
2019 సెమీస్‌లో టీమిండియా కేవలం ఒకే ఒక్క లెఫ్ట్ హ్యాండర్‌తో బరిలోకి దిగి తగిన మూల్యం చెల్లించుకుంది. తొలి ఏడుగురు బ్యాటర్లలో కేవలం పంత్‌ మాత్రమే లెఫ్ట్ హ్యాండర్‌. తర్వాత 8వ స్థానంలో వచ్చిన జడేజా మినహా మరో లెఫ్ట్ హ్యాండర్‌ లేడు. ఇది ఫీల్డింగ్‌ టీమ్‌కి ప్లస్‌గా మారింది. రానున్న వరల్డ్ కప్‌లో ఈ తప్పు జరగకూడదని.. ఫామ్‌లో ఉన్న తిలక్‌ వర్మని ఆడించాలని రవిశాస్త్రి లాంటి మాజీలు సూచిస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న వెంటనే రాహుల్‌ నుంచి మునపటి ఫామ్‌ ఆశించాలేమని చెబుతున్నాడు. కేఎల్ రాహుల్ కంటే కూడా తిలక్ వర్మను ఆసియా కప్ కోసం ఎంపిక చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియాలో టాప్-7 బ్యాటర్లలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే మంచిదని అభిప్రాయపడ్డాడు రవిశాస్త్రి. 2019 సెమీస్‌లో ధవన్‌ లేని లోటు స్పష్టంగా కనిపించిందని గతాన్ని గుర్తు చేసుకున్నాడు ఈ మాజీ కోచ్.