రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిజానికి ఈ సీజన్ ఫస్టాఫ్‌లో 8 మ్యాచ్‌లకు ఒక్కటే గెలిచిన ఆర్సీబీ.. సెకండాఫ్‌లో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరింది. దాంతో సీఎస్కేపై విజయానంతరం ఆర్సీబీ ఆటగాళ్లు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. అభిమానులు అయితే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.మరోవైపు చెన్నై ఓటమిని రాయుడు తట్టుకోలేకపోయాడు. కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిందనే బాధలో రాయుడు ఆర్సీబీ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. ప్లే ఆఫ్స్ చేరితేనే ఆర్సీబీ, ఆ జట్టు అభిమానులు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చాడు.
స్టార్ స్పోర్ట్స్ చిట్ చాట్ లో ఆర్సీబీటైటిల్ గెలుస్తుందని వరుణ్ అరుణ్ చెప్పగా.. ఇప్పటికే టైటిల్ గెలిచిందని రాయుడు సెటైర్లు పేల్చాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచిందనే కదా.. ఆ జట్టు అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారని సెటైరికల్‌గా మాట్లాడాడు. వెంటనే వరుణ్ అరుణ్.. ఆర్సీబీ విజయాన్ని రాయుడు జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పాడు. అయినా రాయుడు వెనక్కి తగ్గకుండా సీఎస్కే గెలిచిన ఐదు ట్రోఫీల్లో ఒకటి ఆర్సీబీకి ఇచ్చిందని, దాంతో వారు బెంగళూరులో సంబరాలు చేసుకున్నాడని తెలిపాడు.అంతేకాకుండా ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. రాయుడి వ్యాఖ్యలపై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.