టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆల్ రౌండర్లకు ఉండే ప్రయారిటీనే వేరు.. మ్యాచ్ ను మలుపుతిప్పే ఆల్ రౌండర్ల కోసం ఐపీఎల్ లో ప్రతీ ఫ్రాంచైజీ వెతుకుతుంటాయి. ఐపీఎల్ మెగా వేలం ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆల్ రౌండర్ల వేటలో పడింది. అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకునేందుకు పక్కాప్లానింగ్ వేలానికి రెడీ అవుతోంది. ఆర్సీబీ ఈ సారి వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ స్టోయినిస్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతున్న స్టోయినిస్ ను ఆ ఫ్రాంచైజీ రిలీజ్ చేస్తే వేలంలో దక్కించుకునేందుకు బెంగళూరు రెడీగా ఉంది. గత సీజన్ లో ఈ ఆసీస్ క్రికెటర్ బ్యాట్ తో పాటు బంతితోనూ రాణించాడు.
అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్న తెలుగుకుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపైనా ఆర్సీబీ ఫోకస్ పెట్టింది. వైజాగ్ కు చెందిన నితీశ్ గత సీజన్ లో 300కు పైగా పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ వేలంలోకి వదిలేస్తే నితీశ్ ను కూడా తీసుకోవాలని ఆర్సీబీ అనుకుంటోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ కోసం ఆర్సీబీ ప్రయత్నించే అవకాశాలున్నాయి. గత సీజన్ లో ఈ యువ ఆల్ రౌండర్ 573 పరుగులతో అదరగొట్టాడు. హిట్టర్ గా , స్పిన్నర్ గా పరాగ్ తమ జట్టుకు అదనపు బలం అవుతాడని బెంగళూరు టీమ్ భావిస్తోంది.