భారత్ – ఇంగ్లండ్ (India-England) మూడో టెస్ట్ టీమిండియా సత్తాకు పరీక్షగా మారింది. టీమిండియాను వరుస గాయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ దూరం అవగా.. ఇప్పుడు కేఎల్ రాహుల్ (KL Rahul) మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.. మరి సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారతాయా.. 1-1తో ఉన్న టీమిండియా (Team India) లీడ్‌లోకి వెళ్తుందా..
భారత్ – ఇంగ్లండ్ జట్ల ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కీలకదశకు చేరింది. రాజ్ కోట (Raj Kota) వేదికగా గురువారం జరిగే మూడోటెస్టు రెండు జట్ల సత్తాకు పరీక్షగా మారింది. ఇప్పటికే రెండు టీమ్‌లు ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఐదుమ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల్లో… రెండు జట్లు చెరో గెలుపుతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో.. రాజ్ కోట వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్టు… భారత్ ఇంగ్లండ్ జట్లకు డూ ఆర్ డై గా మారింది. అయితే.. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది.
ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా మ్యాచ్‌కు అందుబాటులో లేడు. హైదరాబాద్ టెస్టులో రాహుల్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దాంతో రెండో టెస్టుకు దూరం అయ్యాడు. ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టుల కోసం బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో కేఎల్ రాహుల్‌తో పాటు రవీంద్ర జడేజా ఉన్నారు. అయితే.. వీరిద్దరూ ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని జట్టును ప్రకటించే సమయంలో బీసీసీఐ తెలిపింది. జడేజా పూర్తి ఫిట్‌నెస్ సాధించగా.. రాహుల్ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు. మరో వారం రోజుల పాటు అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉంటాడు. నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక కేఎల్ రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ టీమ్‌లోకి వస్తాడని బీసీసీఐ (BCCI) వర్గాలంటున్నాయి. ప్రస్తుతం పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. పంజాబ్ పై 193 పరుగులు చేసిన పడిక్కల్ గోవాపై 103, తాజాగా కర్ణాటకపై 151 పరుగులతో సెంచరీల పండగ చేసుకుంటున్నాడు. కానీ.. రాహుల్ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చినా.. తుది జట్టులో ఉండే అవకాశం కనిపించడం లేదు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటం చేసే అవకాశం ఉంది. ఇక గురువారం ప్రారంభమయ్యే టెస్టు కోసం రెండు టీమ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాజ్‌కోట్ SCA గ్రౌండ్‌లో సాధన చేసాయి. మూడో టెస్టులో విజయం సాధించి.. సిరీస్‌లో పైచేయి సాధించాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.