రోహిత్ ఒక్కడికే రూ.50 కోట్లా… మిగిలిన ప్లేయర్స్ వద్దా ?

ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం రెండు ఫ్రాంచైజీలు ఎంతైనా ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని వార్త...

  • Written By:
  • Publish Date - August 24, 2024 / 06:12 PM IST

ఐపీఎల్ మెగా వేలం ఏడాది చివర్లో జరగబోతోంది. ఈ సారి సరికొత్త రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా మంది స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రానున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు కోట్లు వెచ్చించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం రెండు ఫ్రాంచైజీలు ఎంతైనా ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ 50 కోట్ల వరకూ హిట్ మ్యాన్ కోసం చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
లక్నో, ఢిల్లీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. రోహిత్‌తో ఆ కోరిక నెరవేర్చుకోవాలని ఈ రెండు జట్లు భావిస్తున్నాయి.

కాగా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రికార్డ్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. గత ఏడాది మినీ వేలంలో అతన్ని 24.75 కోట్ల భారీ ధరకు కోల్ కత్తా సొంతం చేసుకుంది. ఒకవేళ రోహిత్ కోసం 50 కోట్లు వెచ్చిస్తే ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా మిగిలిపోతుంది. ఇదిలా ఉంటే ఒక్క ప్లేయర్ కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ టీమ్స్ పర్స్ వాల్యూ 100 కోట్లుగా ఉంది. మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ పర్స్ వాల్యూ 20-25 కోట్లు పెంచే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఒక్కడికే 50 కోట్లు ఖర్చు చేస్తే.. 75 కోట్లతో మిగతా 24 మంది ఆటగాళ్లను తీసుకోవడం కష్టం. అప్పుడు స్టార్ ప్లేయర్స్ ను తీసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. దీని ప్రకారం చూసుకుంటే 30 కోట్ల వరకూ వెచ్చించే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.