JioCinema: మూడు వన్‌డేల ఆసీస్ సిరీస్ ఫ్రీగా చూడాలంటే ఎలా..?

ఓటిటి సంస్థ జియో సినిమా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 03:41 PM IST

JioCinema: వన్డే వరల్డ్ కప్‌కు మందు టీమిండియాతో ఈనెల చివర్లో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రకటించారు. ఈ మేరకు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది మేనేజ్‌మెంట్. దాదాపు వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే జట్టునే ఈ సిరీస్‌కు కూడా బరిలోకి దించనుంది. ఈ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించనున్నాడు. పూర్తిస్థాయి జట్టుతో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా గాయపడ్డ ట్రావిస్ హెడ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ప్లేయర్లంతా భారత్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు తిరిగి జట్టులో చేరారు. టోర్నీ మూగిసిన దాదాపు వారం రోజుల తర్వాత వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు కూడా ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి.
తొలి వన్డే, సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనుంది. రెండో వన్డే, సెప్టెంబర్ 24న ఇండోర్ వేదికగా జరుగనుంది. మూడో వన్డే, సెప్టెంబర్ 27న రాజ‌కోట్ వేదికగా జరగనుంది. మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.39 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ ఇంకా జట్టును ప్రకటించలేదు. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు తొలుత వన్డే సిరీస్ మాత్రమే ఆడనుంది. వన్డే వరల్డ్ కప్ పూర్తయ్యాక.. టీ20 సిరీస్ జరగనుంది. నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఓటిటి సంస్థ జియో సినిమా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట.

ఇటీవల బీసీసీఐ బ్రాడ్ కాస్ట్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జియోసినిమా కూడా ఈ కంపెనీకి చెందినదే. ఈ క్రమంలోనే కొత్త సైకిల్‌లో భాగంగా ఆసీస్‌తో సిరీస్ ఈ సంస్థకు తొలి కవరేజ్. దీన్ని అందరికీ ఉచితంగా ఇవ్వాలని జియోసినిమా భావిస్తోంది. అంతేకాదు మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచులను వీక్షించే అవకాశం కల్పిస్తుందట. సురేష్ రైనా, హనుమ విహారి, అమిత్ మిశ్రా వంటి మంచి ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా జియోసినిమా ప్రయత్నిస్తోంది. దేశంలో క్రీడలను చూసే అనుభవాన్ని పూర్తిగా మార్చేయడమే తమ లక్ష్యం అని వయాకామ్18 కంపెనీ సీఈవో అనిల్ జయరాజ్ స్పష్టం చేశారు.