ఆ రూల్ పై ఫ్రాంచైజీల అసంతృప్తి మార్చాలని బీసీసీఐకి రిక్వెస్ట్

ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతుండగా.. బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేసింది. గత రూల్స్ కు భిన్నంగా ఈ సారి ఆరుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ను కూడా మళ్ళీ తీసుకొచ్చింది.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 10:38 AM IST

ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతుండగా.. బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేసింది. గత రూల్స్ కు భిన్నంగా ఈ సారి ఆరుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ను కూడా మళ్ళీ తీసుకొచ్చింది. అదే సమయంలో ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను కూడా 120 కోట్ల వరకూ పెంచారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు కూడా విధించింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ఆర్‌టీఎమ్ రూల్‌పై ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నయా రూల్‌పై పునరాలోచన చేయాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

మెగా వేలానికి వదిలేసిన తమ ఆటగాళ్లను ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఒకరిని తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే గతంలో ఈ రూల్ ప్రకారం.. ప్రత్యర్థి ఫ్రాంచైజీ బిడ్ వేసిన ధరను చెల్లించి జట్టులోకి తీసుకునేది. కానీ ఈ సారి బీసీసీఐ ఈ నిబంధనలో మార్పులు చేసింది. బిడ్ వేసిన టీమ్‌కు సదరు ప్లేయర్‌ను తీసుకునేందుకు కూడా మరో అవకాశం ఇచ్చింది. మరోసారి బిడ్ వేసే వెసులుబాటు కల్పించింది. అప్పుడు ఆ ఆ ధరను చెల్లిస్తేనే ఆర్‌టీఎమ్ కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. ఉదాహరణకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ట్రావిస్ హెడ్‌ను ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. వేలంలో ఆర్‌సీబీ అతని కోసం 12 కోట్ల వరకు బిడ్ వేసి దక్కించుకుంది. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్‌టీఎమ్ కార్డుతో ట్రావిస్ హెడ్‌ను తీసుకోవాలనుకుంటే పాత రూల్ ప్రకారం 12 కోట్లు చెల్లించాలి. కానీ బీసీసీఐ కొత్తగా మార్చిన రూల్ ప్రకారం ఆర్సీబీ మళ్ళీ బిడ్ వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆర్‌సీబీ 13 కోట్లకు బిడ్ వేస్తే.. సన్‌రైజర్స్ ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే….. లేదంటే ట్రావిస్ హెడ్‌ ను ఆర్‌సీబీ దక్కించుకుంటుంది.

ఈ కొత్త నిబంధనపై ఫ్రాంచైజీలు అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నాయి. ఆర్‌టీఎమ్ ప్రాథమిక ఉద్దేశానికి విరుద్దంగా ఈ నయా రూల్ ఉందని అభిప్రాయపడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఆటగాడి ధరను పెంచడానికి అవకాశం ఇస్తోందని ఓ ఫ్రాంచైజీ ప్రతినిధి వ్యాఖ్యానించాడు. దీనిపై బీసీసీఐకి ఫ్రాంచైజీలు రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఫ్రాంచైజీల విజ్ఞప్తిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగా వేలం ఈ సారి విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆదరణ పెంచే ఉద్దేశంతోనే వేలాన్ని విదేశాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాయి.