సొంతగడ్డపై ఊహించని పరాభవం చవిచూసిన టీమిండియా ఇప్పుడు మూడో టెస్టుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సిరీస్ చేజారిపోయిన నేపథ్యంలో క్లీన్ స్వీప్ అవమానాన్ని తప్పించుకోవాలంటే చివరి టెస్టులో గెలిచి తీరాలి. పైగా ఈ మ్యాచ్ లో విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసుకు కీలకం కానుంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కివీస్ ను నిలువరించాలని భారత్ పట్టుదలగా ఉంది. పుణే ఓటమి తర్వాత జట్టులో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కీలక ఆటగాళ్ళకు విశ్రాంతినిచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆసీస్ టూర్ లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుండడంతో కివీస్ తో మూడో టెస్ట్ నుంచి స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా ఈ ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ఆసీస్ పిచ్ లపై బూమ్రా అత్యంత కీలకం కానున్నాడు. పైగా గాయం నుంచి మహ్మద్ షమీ కోలుకోకపోవడంతో బూమ్రాపైనే భారం పడనుంది.
ఈ నేపథ్యంలో కివీస్ చివరి టెస్ట్ నుంచి అతనికి విశ్రాంతినిస్తే ఆసీస్ టూర్ కు సరికొత్తగా రెడీ అవుతాడని భావిస్తోంది. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను సైతం తప్పించే అవకాశాలున్నాయి. తొలి టెస్టులో గాయపడి, తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన పంత్ రెండో టెస్టులో కీపింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేశాడు. ప్రస్తుతం పూర్తిగానే కోలుకున్నపటకీ రొటేషన్ పధ్ధతిలో అతనికి విశ్రాంతినివ్వడం గురించి కూడా టీమిండియా మేనేజ్ మెంట్ ఆలోచిస్తోంది. ఒకవేళ పంత్ కు రెస్ట్ ఇస్తే మాత్రం కెఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి రానున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో సెంచరీ చేయడంతో రాహుల్ ను రెండో టెస్టులో తప్పించారు.
ఇదిలా ఉంటే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్ కే పరిమితం కాక తప్పదు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ పుణే టెస్టులో అదరగొట్టేశాడు. మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే ఆసీస్ టూర్ కు కూడా సుందర్ ఎంపికయ్యాడు. దీంతో మూడో స్పిన్నర్ గా అతనే కొనసాగనున్నాడు. అశ్విన్, జడేజా కూడా పుణే టెస్టులో రాణించారు. అయితే బూమ్రాకు రెస్ట్ ఇవ్వాలన్న ఆలోచన నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మళ్ళీ జట్టులోకి రానున్నాడు. సిరాజ్ తో పాటు ఆకాశ్ దీప్ పేస్ బాధ్యతలను మోయనున్నాడు. కాగా ముంబై పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా. మరోవైపు కివీస్ చేతిలో సిరీస్ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ సీజన్ లో మరో ఆరు మ్యాచ్ లు మిగిలి ఉండగా… టీమిండియా కనీసం 4 ఖచ్చితంగా గెలిస్తేనే ఫైనల్ కు చేరే అవకాశముంటుంది. దీంతో కివీస్ తో జరిగే చివరి టెస్ట్ గెలుపు అటు క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించడమే కాదు డబ్ల్యూటీసీలో మన ఫైనల్ అవకాశాలను నిలబెడుతుంది. కాగా భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి టెస్ట్ నవంబరు 1 నుంచి ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.