గత రెండేళ్ళూ మరిచిపోయావా ? ఓవరాక్షన్ తగ్గించుకో పాంటింగ్

  • Written By:
  • Publish Date - August 14, 2024 / 04:03 PM IST

పెద్ద జట్లతో సిరీస్ అంటే చాలు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ మొదలుపెడుతుంది. ఈ మైండ్ గేమ్ లో ఆసీస్ మీడియాతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు కూడా భాగమవుతారు. ప్రత్యర్థి జట్లను రెచ్చగొట్టి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై జోస్యం చెప్పాడు. భారత్ తో ఏడాది చివర్లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ ను ఆసీస్ గెలుస్తుందని అంచనా వేశాడు. భారత్ 1-3 తేడాతో ఓడిపోతుందంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.

ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగుతుందని అయితే గత రెండు సిరీస్‌ల ఫలితాల నేపథ్యంలో సొంతగడ్డపై ఆసీస్ తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఏది ఏమైనా ఈ సిరీస్‌ను ఆసీస్ 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అయితే పాంటింగ్ కామెంట్స్ కు భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అనవసరంగా రెచ్చగొట్టి మళ్ళీ ఘోరపరాజయం రుచి చూడొద్దంటూ ఫైర్ అవుతున్నారు. ఆసీస్ మైండ్ గేమ్ కు దెబ్బతినే పరిస్థితుల్లో టీమిండియా లేదని, పాంటింగ్ గత రెండు సిరీస్ లు మరిచిపోయాడేమోనంటూ గుర్తు చేస్తున్నారు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటైన తర్వాత గబ్బాలో ఏ విధంగా భారత్ సిరీస్ గెలిచిందో గుర్తు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పాంటింగ్ కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదంటూ సలహాలిస్తున్నారు.